అభి, నీ బ్ర‌ద‌ర్‌ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ‌

Bigg Boss 4 Telugu: Contestants Family Members Spread Love In House - Sakshi

క‌న్న‌వాళ్ల‌ను చూసి సంతోషించిన కంటెస్టెంట్లు

ఈ సారైనా కెప్టెన్ అవమ‌ని హారిక త‌ల్లి కౌంట‌ర్‌

పెళ్లి చేస్తాన‌ని అవినాష్ త‌ల్లి హామీ

బిగ్‌బాస్ హౌస్‌లో ఓ రోజు ఉండాల‌నుంది: అభి త‌ల్లి

బిగ్‌బాస్ జ‌ర్నీలో కంటెస్టెంట్లు వారి కుటుంబాల‌ను క‌ల‌సుకునే ఎపిసోడ్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఇంటిస‌భ్యుల‌ తప్పొప్పుల‌ను స‌రిచేస్తూ ఆట‌తీరు మెరుగుప‌ర్చుకునేందుకు వారిచ్చే స‌ల‌హాలు ఎంతో విలువైన‌వి. కానీ ఈసారి అలాంటి అవ‌కాశ‌మేమీ ల‌భించ‌లేదు. ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడుకునే స్పేస్ దొర‌క్క‌పోయినా కావాల్సినంత ప్రేమ‌ను పంచారు. అదేంటో కానీ కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ లోనికి అడుగు పెట్టేకొద్దీ లోప‌ల ఉన్న కంటెస్టెంట్ల మ‌న‌సులు శుద్ధిగా మారిపోయాయి. నామినేష‌న్ గొడ‌వ‌ల‌ను గాలికొదిలేసి అంతా ఒకే కుటుంబం అన్న‌ట్లుగా క‌లిసిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌రి ఇన్ని వింత‌లు చోటు చేసుకున్న‌ నేటి 74వ ఎపిసోడ్‌లో ఏమేం జ‌రిగాయో తెలుసుకోవాలంటే ఆల‌స్యం చేయ‌కుండా చ‌దివేసేయండి..

అవినాష్‌ను ఆడుకున్న సోహైల్‌
‌ఓ వైపు మ‌ట‌న్ పాడు చేసినందుకు కంటెస్టెంట్ల‌తో చీవాట్లు, మ‌రోవైపు నాన్‌వెజ్ తిన‌కూడ‌ద‌న్న బిగ్‌బాంబ్ అవినాష్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇలాంటి స‌మ‌యంలో‌ సోహైల్, అవినాష్ ప‌క్కన చేరి మ‌ట‌న్ ఆవురావురుమ‌ని లాగిస్తూ అత‌డికి ఊరిళ్లు తెప్పించాడు. దీంతో అవినాష్ త‌న జిహ్వ చాప‌ల్యాన్ని కంట్రోల్ చేసుకునేందుకు నానా తంటాలు ప‌డ్డాడు. సోహైల్ మాత్రం నేల మీద పాకుతూ మ‌రీ ప్లేటు ఖాళీ చేశాడు. త‌ర్వాత హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను ఒక్కొక్క‌రిగా పంపించాడు. ముందుగా అఖిల్ అమ్మ దుర్గ‌ రాగానే అత‌డు చంటిపిల్లాడిలా ఏడ్చాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: హారిక‌కు ఇచ్చి ప‌డేసిన సోహైల్‌)

మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అమ్మ‌కు..
మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అఖిల్ త‌న అమ్మ‌కు ఇచ్చాడు. ఆమె హారిక‌ను ప‌ట్టుకుని నీలాంటి ఆడ‌పిల్ల కావాలి అన‌డంతో హారిక ఆనందంతో గాల్లో తేలియాడింది. అంద‌రి గురించి అన్నీ చెప్తున్న ఆమె మోనాల్ గురించి ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డంతో త‌న గురించి కూడా చెప్పమ‌ని అఖిల్ నోరు తెరిచి అడిగాడు. దీంతో ఆమె మోనాల్ నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అద్దం తెర చాటు నుంచే కొడుక్కు ముద్దు పెట్టింది. అలాగే అఖిల్‌కు అభిజిత్ అన్న‌, లాస్య అక్క అని చెప్పింది. ఆమె వీడ్కోలు తీసుకోగానే ఏదో మంత్రం వేసిన‌ట్టుగా అభిజిత్‌, అఖిల్‌, సోహైల్ క‌లిసిపోయారు. (చ‌ద‌వండి: ఇక చాలు ఆపండి, అభిజిత్ విన్న‌రేంటి?)

హారిక‌తో చ‌క్క‌ర్లు కొట్టేందుకు అభి ప్లానింగ్‌
ప్లాంక్ వాక్(నేల‌మీద పాక‌డం) పెట్ట‌కండ‌ని అరియానా బిగ్‌బాస్‌ను వేడుకుంది. ఆ వెంట‌నే అంద‌రూ పాకాల‌ని బిగ్‌బాస్ బజ‌ర్ మోగించాడు. దీంతో చ‌చ్చిన‌ట్లు నేల‌మీద ప‌డి పాక‌డం మొద‌లుపెట్టారు. వారిని ప‌వ‌ర్ సేవ్ మోడ్‌లో ఉంచిన బిగ్‌బాస్ హారిక త‌ల్లి జ్యోతిని లోనికి పంపించారు. హారిక‌ను చూసుకుంటున్నందుకు ఆమె అభిజిత్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచాన‌ని హారిక గుడ్‌న్యూస్‌ చెప్ప‌గా ఈసారైనా గెలుస్తావా? అని ఏడిపించింది. ఇంత‌లో అభిజిత్ అందుకుంటూ మీరు అనుమ‌తిస్తే హారిక‌ను ఓసారి ఓ చోటుకు తీసుకెళ్తాను అని అడ‌గ్గా ఆమె అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

వేస్ట్‌గాడు అన్నందుకు సారీ: హారిక‌
త‌ర్వాత లోనికి వ‌చ్చిన అభిజిత్ అమ్మ ల‌క్ష్మి‌ కొడుకును చూడ‌గానే సంతోషంతో ఏడ్చేసింది. దీంతో ఎమోష‌న‌ల్ అవొద్దు అంటూ అభి త‌ల్లిని ఓదార్చాడు. ఆమె కొడుకు క‌న్నా ఎక్కువ‌గా అంద‌రి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న‌కు కూడా హౌస్‌లో ఓ రోజు ఉండాల‌నుంద‌ని మ‌న‌సులోని మాట చెప్పింది. ఈ అవ‌కాశం మ‌ళ్లీ దొర‌క‌ద‌ని బాగా ఎంజాయ్ చేయండి, కొట్టుకోండి అని స‌ల‌హా ఇచ్చింది. సంతోషం ప‌ట్ట‌లేని కంటెస్టెంట్లు డ్యాన్సు చేస్తూ కుప్పిగంతులు వేశారు. బ‌య‌ట‌కు వెళ్లాక‌ మ‌నం కొట్టుకున్న‌ది చూసి న‌వ్వుకుంటామ‌ని అభిజిత్ చెప్పుకొచ్చాడు.  దానికంత‌టికీ కార‌ణ‌మైనందుకు అఖిల్‌, సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన అభి హారిక‌కు ధ‌న్య‌వాదాలు చెప్ప‌కుండా హారిక‌కు హ‌గ్గిచ్చాడు. త‌ర్వాత హారిక వేస్ట్‌గాడు అన్నందుకు సోహైల్‌కు సారీ చెప్పింది. (చ‌ద‌వండి: నేను గేమ్ ఆడ‌టానికి రాలేదు‌: అభిజిత్)

ప్ర‌తిసారి పెళ్లి అన‌కు, వ‌చ్చాక చేస్తా
త‌ర్వాత అవినాష్ అమ్మ మ‌ల్ల‌వ్వ‌ లోప‌ల‌కు వ‌చ్చింది. కొడుకు మీద ముద్దుల వ‌ర్షం కురిపించింది. కంటెస్టెంట్లు అంద‌రూ బాగుండాల‌ని రోజూ దేవుళ్ల‌కు పూజ‌లు చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది. ఊరికే పెళ్లి అంటూ క‌ల‌వ‌రించొద్ద‌ని, బ‌య‌ట‌కు వ‌చ్చాక చేస్తాన‌ని హామీ ఇచ్చింది. చాలా మంది ఇంటికొచ్చి త‌న‌ను సెల్ఫీ అడుగుతున్నార‌ని తెలిపింది. వెళ్లిపోయే ముందు హౌస్‌మేట్స్‌తో క‌లిసి హుషారుగా స్టెప్పులేసింది. ఆమె వెళ్లిపోగానే అవినాష్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. త‌న రెండు మోకాళ్లు అరిగిపోయి ఆప‌రేష‌న్ అయింద‌ని, తాను వ‌చ్చేముందు న‌డ‌వ‌లేని స్థితిలో ఉండేద‌ని అరియానాతో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు న‌డ‌వ‌గ‌లుగుతోంద‌ని ఎమోష‌న‌ల్ అయ్యాడు. మొత్తానికి నేటి ఎపిసోడ్ కొంత భారంగా మ‌రికొంత వినోదాత్మ‌కంగా సాగింది. వ‌చ్చిన వాళ్లంద‌రూ అఖిల్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్తూ అవినాష్‌కు పిల్ల‌ను చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. కానీ ఈ ఎపిసోడ్ అంద‌రినీ మార్చేసింది. వారి మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లను తుంచి, మ‌న‌స్ప‌ర్థ‌ల‌ను చెరిపేసింది. అంద‌రి మ‌న‌సుల్లో ప్రేమ‌ను మాత్ర‌మే వ్యాపింప‌జేసింది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top