
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు.
అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్‌మీట్‌లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌లను పోలీస్‌స్టేషన్ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్‌స్టేషన్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్ అవుతున్నారు.
తారక్ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే
ఒక ఫోన్ కాల్‌లో ఎన్టీఆర్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.