
వైద్యవిద్యలో నీట్ పరీక్షల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా నీట్ పరీక్షల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కారణంగా నీట్ వద్దని తమిళనాడుసహా పలు రాష్ట్రాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది నీట్ పరీక్షల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎలాంటి చిత్రం రూపొందలేదు. కాగా తొలిసారిగా అలాంటి కథతో 'అంజామై' అనే చిత్రం కోలీవుడ్‌లో రూపొందింది.
ఈ చిత్రం ద్వారా దర్శకుడు మోహæన్‌రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. నటుడు విదార్థ్, వాణిభోజన్, రఘుమాన్, క్రితిక్ మోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తిరుచ్చిత్రం పతాకంపై డాక్టర్ ఎన్.తిరునావుక్కరసు నిర్మించారు. మనోతత్త్వ వైద్యుడు, ఉపాధ్యాయుడు అయిన ఈయన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో నిత్ర నిర్మాణం చేపట్టి నిర్మించిన తొలి చిత్రం అంజామై. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన ఈ చిత్రం విడుదల హక్కులను పూర్తిగా డ్రీమ్ వారియర్స్ సంస్థ పొందడం విశేషం.
ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ 'అంజామై' చిత్రాన్ని కొనుగోలు చేయడం విశేషం. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.