అన్నపూర్ణ స్టూడియోకి ఎందుకు దూరమయ్యానంటే: వెంకట్ అక్కినేని

Akkineni Venkat Comments On Annapurna Studios - Sakshi

అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని తెలుగు ఇండస్ట్రీలో పలు సినిమాలను నిర్మాతగా నిర్మించారు. ఆ చిత్రాలన్నీ కూడా అన్నపూర్ణ బ్యానర్‌పై నిర్మించారు. అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసత్వాన్ని విజయవంతంగా నాగార్జున కొనసాగిస్తున్నారు. కానీ ఏఎన్నాఆర్‌ పెద్దాబ్బాయి అమెరికాలో చదువుకుని ఇండియా తిరిగొచ్చారు. కానీ ఆయన మీడియాకు కొంచెం దూరంగానే ఉంటూ వచ్చారు. తాజాగా ఒక  ఇంటర్వ్యూలో అనేక విషయాలను ఆయన పంచుకున్నారు. 

'నేను, నాగార్జున ఇద్దరం కూడా  మొదట ఇండస్ట్రీ వాతావరణంలో పెరగలేదు. మా ఇద్దరికి సినిమా ప్రపంచం అంతగా తెలియదు.. మేము బాగా చదువుకోవాలని చెప్పి, మమ్మల్ని నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. దీంతో అప్పట్లో సినిమాల గురించి మా ఇద్దరికీ ఏమీ తెలిసేది కాదు. సినిమాలకి సంబంధించిన కార్యక్రమాలను నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం ఎప్పుడూ కూడా చేయలేదు. అలా మా చదువులు పూర్తి అయిన తర్వాత నాగార్జున సినిమా ఎంట్రీ గురించి కూడా మొదట నేనే నాన్నగారితో మాట్లాడాను. నాగార్జునను హీరోగా చేద్దాం అని చెప్పాను దానికి ఆయన వెంటనే ఓకే అనేశారు.  

నేను నిర్మాతగా మారడానికీ .. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాము. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు నేను చూసుకున్నాను. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి నేను పక్కకి తప్పుకున్నాను. సినిమా వ్యవహారాలు నాకు అంతగా తెలియవు.. ఆ విషయాలపై నాగార్జునకు మంచి అవగాహన ఉంది. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఎప్పుడూ మేము టచ్‌లోనే ఉంటాము. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు అన్నీ నాగార్జుననే  చూసుకుంటున్నాడు.' అని వెంకట్‌ చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top