
బుల్లితెర జంట చందు- పవిత్ర మరణం అందరినీ షాక్‌కు గురి చేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు త్వరలోనే భార్యాభర్తలుగా తమను పరిచయం చేసుకుందామనుకున్నారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో పవిత్ర మరణించగా తర్వాత ఐదు రోజులకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనపై ప్రముఖ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఎవరి జీవితం వాళ్లది!
'ఉమ్మడి కుటుంబంలో ఒకరు కిందపడితే పదిమంది వచ్చి పైకి లేపేవాళ్లు. మేమున్నామంటూ సపోర్ట్ చేసేవాళ్లు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేశాం. అమ్మానాన్న పిల్లలు.. ఇదే కుటుంబం! ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది, ఎవరి ఆశయాలు వాళ్లవి.. ఒక స్టేజ్ దాటాక ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు. పెద్దల మాటను పిల్లలు లెక్కచేయడం లేదు.
ఒంటరితనం
సంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అసలేం కోల్పోతున్నారనేది వాళ్లకు అర్థం కావడం లేదు. ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరైపోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు. నా విషయమే తీసుకుంటే అమ్మ చనిపోయాక కృష్ణగారు, నేను ఎంతగానో బాధపడ్డాం. మేము ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం.
ఆ బలం వేరు
రోజూ ఉదయాన్నే ఆయనను పలకరించేవాడిని. మహేశ్‌బాబు కూడా మేము వచ్చి చూసెళ్తాం.. అని ధైర్యం చెప్పేవాడు. పది మంది నాకున్నారు అన్న బలం వేరు! ఎవరైనా మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కనుండాలి. ఈరోజుల్లో అది లేకుండా పోయింది. బంధాలు, బంధుత్వాలు లేకనే ఇలాంటివి జరుగుతున్నాయి' అని నరేశ్ అభిప్రాయపడ్డాడు.
చదవండి: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా