●జిల్లాను అన్నిరంగాల్లో ముందంజలో ఉంచుతా ●ప్రజాపాలన వేడుకల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్
అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందజలో ఉంచుతానని హామీ ఇచ్చారు.
– మెదక్‌జోన్
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై ప్రజాపాలనకు నాంది పలికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుందని మంత్రి వివేక్ అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం కోసం ఈ గడ్డపై అనేక మంది త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాటం మరింత తీవ్రతరమైందన్నారు. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి మహిళా యోధులు పోరాటంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైందన్నారు.
48 గంటల్లోనే శ్రీకారం
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే అభయహస్తం హామీల అమలుకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు, రైతులు, పేదలు, విద్యార్థులు, కార్మికులు, యువతతో పాటు అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.4.73 కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించామని వివరించారు. దీని ద్వారా రూ.171.04 కోట్ల ప్రయోజనం మహిళలకు అందిందన్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,29,756 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు జీరో బిల్లులు జారీ చేసి, రూ.113.80 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. రైతు భరోసా కింద జిల్లాలో 2,66,674 మంది రైతుల ఖాతాల్లో రూ.222.69 కోట్ల పెట్టుబడి సాయం జమ చేసినట్లు చెప్పారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు 28,933 ఎకరాల్లో సాగు చేసినట్లు వివరించారు.
రూ.1,116 కోట్లతో ధాన్యం సేకరణ
యాసంగి 2025–26 సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. 1,00,344 మంది రైతుల నుంచి 4,25,305 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ.1,116.06 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
జాతీయ జెండాను
ఆవిష్కరిస్తున్న మంత్రి వివేక్


