కరెంట్‌ కోతలపై రైతుల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కోతలపై రైతుల కన్నెర్ర

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): 24 గంటల కరెంట్‌ దేవుడెరుగు, కనీసం 6 గంటల కూడా సరిగా రావడం లేదని మండలంలోని జంగరాయి రైతులు గురు వారం ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం సబ్‌స్టేషన్‌ను ముట్టడించి సిబ్బందిని నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో గవ్వలపల్లి–వెల్దుర్తి రహదారిపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివానందం, తహసీల్దార్‌ మాలతి రైతుల వద్దకు చేరుకుని సముదాయించారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చాలని సూచించారు. ఇదే విషయం రైతులకు చెప్పి ఆందోళనను విరమింపజేశారు.

నార్సింగిలో..

పాపన్నపేట(మెదక్‌): మండల శివారులోని నార్సింగి సబ్‌స్టేషన్‌ ఎదుట మెదక్‌– బొడ్మట్‌పల్లి రోడ్డుపై రైతులు రాస్తారోకోకు దిగారు. వ్యవసాయానికి 12 గంటలు ఇవ్వాల్సిన కరెంట్‌, కేవలం 8 నుంచి 9 గంటల పాటు ఇస్తున్నారని వాపోయారు. దీంతో పంటలు ఎండుతున్నాయని వాపోయారు. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ తన సిబ్బందితో వెళ్లి రైతులను సముదాయించారు. విద్యుత్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడించారు. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు పెట్టొద్దని వారు కోరారు. అధికారులు ఇచ్చిన హామీతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement