రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించినప్పుడే తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతకముందు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు డాకీ శ్యామల స్వామి, బైరం కుమార్ స్వప్న, దేవుని రంజిత్, పుట్టి సందీప్, గుగులోతు రవి, కో–ఆప్షన్ సభ్యులు ఆసియా సుల్తానా, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పెద్దశంకరంపేట(మెదక్): రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెద్దశంకరంపేటలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అనంతరం రైతులతో కలిసి స్థానిక సబ్‌స్టేషన్ ఏఈ శ్యాంసుందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, బీఆర్‌ఎస్ నాయకులు సురేశ్‌గౌడ్, లింగయ్య, రమేశ్, దత్తు, సుభాశ్, శంకర్‌గౌడ్, రవీందర్, అంజయ్య, నర్సింలు, యాదుల్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
నర్సాపూర్: మరింత మంచి పరిపాలన అందించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ కోరారు. గురువారం మోదీ పుట్టిన రోజును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక శివాలయంలో ఆశీర్వాద దీపం వెలిగించి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పార్టీ నాయకులు సురేశ్, ఆంజిగౌడ్, నాగరాజు, రమేశ్‌గౌడ్, కవితారెడ్డి, నవీన్, వీరారెడ్డి, విజయ్, మల్లేశ్, రాజిరెడ్డి, నవీన్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్‌జోన్: వినాయక నిమజ్జనాల సందర్భంగా పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లలను చెరువులు, బావులు, కాలువలు, ఇతర నీటి వనరుల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. ఈత రాని వారు నీటిలోకి దిగకుండా, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి వెళ్లకుండా భద్రతా సూచనలు పాటించాలని తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులు పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. వాహనాలను నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. భక్తులు పోలీసులతో సమన్వయంతో కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.


