మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద పిల్లలే కదా? మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు? అన్న తీరులో ఉంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్స్. ప్రభుత్వం నాణ్యత లేని క్లాత్ పంపిణీ చేయగా, మహిళా సంఘాల సభ్యులు ఇష్టారీతిగా కుట్టి పాఠశాలలకు సరఫరా చేశారు. వాటిని పరిశీలించకుండానే అధికారులు పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. వీటిని ఎలా వేసుకోవాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి నాణ్యమైన దుస్తులు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఆలస్యంగా పంపిణీ
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలలకు యూనిఫాం క్లాత్ జిల్లాకు రావడంతో స్టిచ్చింగ్ ఆలస్యమైంది. 15 రోజులుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్నారు. ఈనెల 16న జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫాం క్లాత్ నాణ్యత సరిగా లేదు. దీనికి తోడు స్ట్రిచింగ్ మరింత అధ్వానంగా. చొక్కాలకు ఒక చేయి బయటకు, మరో చేయి లోపలికి కుట్టారు. అలాగే జేబును సంచిలా కుట్టారు. నాణ్యత లేని ఒకే ఒక్క కుట్టువేసి వదిలేశారు. ప్యాంట్ పరిస్థితి అలాగే ఉంది. విద్యార్థులకు అందజేసిన సాక్స్‌లు సైజు లేకుండా పోయాయి. వీటిని ఒక్కసారి ఉతికితే మళ్లీ వేసుకునేందుకు పనికి రావని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయమైన డీఈఓ కార్యాలయంలోని యూనిఫాం నిర్వహణ అధికారి రాజును వివరణ కోరగా.. నాణ్యతలేని వాటిని విద్యార్థులకు ఇవ్వొద్దని చెప్పినట్లు తెలిపారు.
విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫామ్‌ల దుస్థితి
కొలతలు తీసుకున్నా, అధ్వానంగా స్ట్రిచింగ్
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు


