ట్రేడ్‌.. మోసమే ట్రెండ్‌! | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌.. మోసమే ట్రెండ్‌!

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

జిల్లాలోని కొందరు మిల్లర్లు మున్సిపాలిటీల ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం క్రయ విక్రయాలకు ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరి కాగా, తీసుకోకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. బల్దియాలకు ప్రధాన ఆదాయం లైసెన్స్‌ల ద్వారానే వస్తుండగా, ఈ విషయమై కమిషనర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

– రామాయంపేట(మెదక్‌)

2020 కంటే ముందు లైసెన్స్‌ రుసుం వసూలు మాన్యువల్‌గా ఉండేది. వ్యాపార రకాన్ని బట్టి వార్షిక రుసుం వసూలు చేసేవారు. ఎంత పెద్ద వ్యాపారమైన రూ. నాలుగైదు వేలకు మించి ఉండేది కాదు. ప్రస్తుతం మున్సిపల్‌శాఖ ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ, ఫీజు వసూలు విధానాన్ని ప్రక్షాళన చేసింది. పరిశ్రమలు, రైస్‌మిల్లులకు పరిమాణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ. నాలుగు నుంచి రూ. ఆరు వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మారిన నిబంధనల మేరకు కనీసం రూ. 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. స్వీయ ధ్రువీకరణ కింద సదరు వ్యాపారి స్వయంగా రైస్‌మిల్లు విస్తీర్ణం, ముందు భాగంలో రోడ్డు వెడల్పు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే ఎంత ఫీజు చెల్లించాలనే విషయం సూచిస్తుంది. ఫీజు చెల్లించగానే లైసెన్స్‌ జారీ అవుతుంది. సదరు వ్యాపారి ఇచ్చిన సమాచారం వాస్తవమా..? కాదా అనే విషయాన్ని తర్వాత మున్సిపల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తప్పుగా తేలితే అసలు రుసుం కంటే 25 శాతం అధికంగా జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉంటుంది. కాగా, లైసెన్స్‌ ఫీజులు చెల్లించకపోవడంతో ఒక్కో మున్సిపాలిటీకి రూ. లక్షల మేర బకాయలు పేరుకుపోయాయి.

వాటికీ సీఎంఆర్‌ కేటాయింపు!

ఆన్‌లైన్‌ విధానం అమలు తర్వాత జిల్లాలోని 15 రైస్‌ మిల్లులకు గానూ కేవలం రెండు మాత్రమే ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకున్నాయి. ఈవిషయమై నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అధికారులు, సిబ్బందికి సైతం సరైన అవగాహన లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోకుండా ధాన్యం, బియ్యం వ్యాపారం చేయవద్దనే నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోని రైస్‌మిల్లులకు సైతం అధికారులు సీఎంఆర్‌ ఇవ్వడం గమనార్హం.

మున్సిపాలిటీ రైస్‌ మిల్లులు లైసెన్స్‌ ఉన్నవి

మెదక్‌ 2 1

తూప్రాన్‌ 5 -

నర్సాపూర్‌ 2 -

రామాయంపేట 6 1

ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోకుండానే

వ్యాపారాలు

15 రైస్‌ మిల్లుల్లో రెండింటికే లైసెన్స్‌

బల్దియాల ఆదాయానికి భారీగా గండి

చర్యలు తప్పవు

రైస్‌ మిల్లులతో పాటు ఇతర వ్యాపార సంస్థలకు ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. తీసుకోని వారు వ్యాపారాలు చేసుకోవడానికి వీలు లేదు. లైసెన్స్‌ లేని వ్యాపార సంస్థలను గుర్తించి త్వరలో నోటీసులు జారీ చేస్తాం.

– రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌,

రామాయంపేట

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement