చిట్టీలతో చీటింగ్
కోట్లాది రూపాయల ఎగవేత
ఈ చిత్రంలోని బాధితుడి పేరు గజవెల్లి కుమారస్వామి. చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి గ్రామం. 15 ఏళ్ల క్రితం రామాయంపేటకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. గడిచిన 6 ఏళ్ల నుంచి రామాయంపేటలో ఓ వ్యక్తి వద్ద తనతో పాటు కుటుంబీకుల పేర్లపై నాలుగు చిట్టీలు వేశాడు. అందుకు రూ. 24 లక్షలు రావాల్సి ఉంది. కాగా చిట్టీల నిర్వాహకుడు ఏదో కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెద్దలు పంచాయితీ నిర్వహించి రూ. 24 లక్షలకు బదులు కేవలం రూ. 2.60 లక్షలు మాత్రమే ఇప్పించారు. ఈ వ్యవహారంలో కుమారస్వామితో పాటు చాలా మంది పోలీసులను ఆశ్రయించారు.
హవేళిఘణాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పద్మ కూతురు పెళ్లి కోసం 2015 నుంచి మెదక్‌లోని ఓ చిట్‌ఫండ్ కంపెనీలో రూ. 10 లక్షల చిట్టీ వేసింది. దీంతో పాటు మరో రూ. 7.50 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. తీరా సదరు చిట్‌ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ సిబ్బందిని కలిస్తే నెలకు రూ. లక్ష చొప్పున బ్యాంకులో తీసుకోవాలని చెక్‌లు ఇచ్చారు. ఆశతో బ్యాంకుకు వెళితే అకౌంట్‌లో మాత్రం డబ్బులు లేవు. ఇదేంటని ప్రశ్నిస్తే డబ్బులకు బదులు మనోహరాబాద్ వద్ద ప్లాట్లు తీసుకోవాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది లేదు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులు రాకపోవడంతో బాధిత కుటుంబం ఆందోళన చెందుతుంది.
మెదక్‌జోన్: మెతుకుసీమలో కొన్ని చిట్‌ఫండ్స్ కంపెనీలు చీటింగ్‌కు కేరాఫ్‌గా మారాయి. ఎంతో నమ్మకంతో చిట్టీలు వేస్తే మోసాలకు తెగబడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు, ఇల్లు కట్టుకునేందుకు ఉపయోగపడతాయనే ఆశతో పైసాపైసా కూడబెట్టి జమ చేస్తే రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేస్తున్నారు. వేలాది మంది నుంచి రూ. కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేశారు. అలాగే ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా చిట్టీల వ్యాపారం నిర్వహించి అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో 2017 నుంచి 2024 వరకు 7 చిట్‌ఫండ్ కంపెనీలు మూసివేయ డం ఇందుకు నిదర్శనం. కొంతమంది తమకున్న పలుకుబడితో డబ్బులు వసూలు చేసుకోగా, మరికొందరు నిలువునా మునిగారు. చేసేదిలేక ఇప్పటికీ పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా రు. జిల్లా కేంద్రంలో రెండేళ్ల క్రితం మూతపడిన ఓ చిట్‌ఫండ్ కంపెనీలో సుమారు 450 మంది డబ్బులు జమ చేస్తే బోర్డు తిప్పేసి ఉడాయించారు. ఇందులో బాధితులతో పాటు ఎంతో మంది ఏజెంట్లు మోసపోయారు. డబ్బులకు బదులు కొంతమందికి ప్లా ట్లు ఇచ్చినట్లు తెలిసింది. మిగితా వారికి నేడు, రేపు అంటు తిప్పుతున్నారు.
అధిక వడ్డీలకు పేట అడ్డా!
జిల్లాలో ముఖ్యంగా అధిక వడ్డీ, రోజువారీ ఫైనాన్స్‌కు రామాయంపేట అడ్డాగా మారింది. చిరు వ్యాపారులు, గిరిజనులకు రూ. 10 వేలు అప్పు కావాలంటే రూ. 9 వేలు మాత్రమే ఇచ్చి, రూ. వెయ్యి కమీషన్ తీసుకుంటున్నారు. వసూలు మాత్రం రూ. 10 వేలు చేస్తున్నారు. రూ. లక్ష అవసరం ఉన్న వారికి రూ. 90 వేలు ఇచ్చి, రోజుకు రూ. 500 చొప్పున.. రెండు వందల రోజుల్లో రూ. లక్ష వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన వడ్డీ వందకు రూ. 10కి పైగా వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గిరిజనులకు నూటికి రూ. 5 నుంచి రూ. 10 చొప్పున అప్పులిచ్చి వారి పట్టాదారు పాస్ పుస్తకాలను షూరిటీగా పెట్టుకుంటున్నారు. బాండ్ పేపర్లు రాసుకొని అమాయకులను నిలువునా ముంచుతున్నారు. ఇందులో చాలా మంది చిట్టీల నిర్వాహకులు ప్రభుత్వ అనుమతి లేకుండా వ్యాపారం కొనసాగించటం గమనార్హం.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చిట్టీల వ్యాపారం నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్టర్ అయిన చిట్‌ఫండ్స్ కంపెనీలు, చిట్టీ వ్యాపారులు అక్రమాలకు పాల్పడితే కోర్టుకు లాగవచ్చు. అను మతి లేకుండా అక్రమంగా చిట్టీలు నడిపితే శాఖాపరమైనా చర్యలు శతీసుకునే అధికారం ఉంది. – రాంమోహన్,
సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి మెదక్ జిల్లా
చోద్యం చూస్తున్న అధికారులు
ఇప్పటికే జిల్లాలో ఏడు చిట్‌ఫండ్స్ కంపెనీల మూత
కొందరు ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ వ్యక్తుల ఇష్టారాజ్యం
బాధితులను కదిలిస్తే కన్నీళ్లే..
చిట్టీలతో చీటింగ్


