ఇసుక కొరత.. తప్పని వెత
● ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన
● ముందుకు సాగని నిర్మాణాలు
● పట్టించుకోని అధికారులు
నర్సాపూర్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఇసుక కొరత అడ్డంకిగా మారింది. లబ్ధిదారుల నుంచి రవాణ చార్జీలు తీసుకొని ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 17న నర్సాపూర్‌లో శాండ్ బజార్‌ను మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ప్రస్తుతం అధికారుల ముందు చూపు కరువై ఇసుక కొరత ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. నర్సాపూర్ డివిజన్‌లోని ఐదు మండలాలకు 2,649 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 1,689 ఇళ్లు నిర్మించేందుకు సంబంధిత అధికారులు ముగ్గు పోసి మార్కింగ్ ఇచ్చారు. మిగిలిన 960 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. మార్కింగ్ ఇచ్చిన ఇళ్లలో సైతం 542 మంది నిర్మాణ పనులు ప్రారంభించలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
ఇప్పటికీ రెండుసార్లు కొరత
శాండ్ బజార్‌లో ఇప్పటివరకు రెండుసార్లు ఇసుక కొరత ఏర్పడటం గమనార్హం. అక్టోబర్‌లో ఒకసారి ఇసుక లేకపోవడంతో సుమారు వారం రోజుల పాటు లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా గత నెల 31 నుంచి (పది రోజులుగా) ఇసుకను తెప్పించడంలో ఆ శాఖ అధికారులు విఫలం అయ్యారు. గత నెలలో వర్షాలు జోరుగా కురవడంతో నిర్మాణాలు సాగలేదని, ప్రస్తుతం వా తావరణం అనుకూలంగా ఉండగా, ఇసుక కరువై పనులు నిలిచిపోతున్నాయని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఇసుక బజార్‌కు స్టాక్ ఎప్పుడు వస్తుందని ఇన్‌చార్జి రాకేశ్‌ను వివరణ కోరగా, త్వరలోనే ఇసుక వస్తుందని, రాగానే ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు.


