విద్యుత్ అధికారుల పల్లెబాట
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం
నారాయణఖేడ్: క్షేత్రస్థాయిలో విద్యుత్ ఇబ్బందులు తీర్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు పల్లెబాట పట్టారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆయా విద్యుత్ సమస్యలతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను తక్షణం పరిష్కరించనున్నారు. ఇంజనీర్లు మొదలుకుని ఆర్టీజన్ స్థాయి సిబ్బంది వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి సమస్యలు తీర్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం సంగారెడ్డి జిల్లాలోనూ అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నారాయణఖేడ్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో 7, జోగిపేటలో 5, సంగారెడ్డిలో 4, సదాశివపేట్‌లో 4, జహీరాబాద్‌లో 7, పటాన్‌చెరులో 9, ఇస్నాపూర్‌లో 2 చొప్పున 38 సెక్షన్లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో సుమారు 158కి పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లున్నాయి. ఈ సబ్‌స్టేషన్ల పరిధిలో గ్రామా లు, పట్టణాలు, కాలనీల్లో ఉన్న విద్యుత్ సమస్యలను అధికారులు తక్షణం పరిష్కారం చేసే చర్యలను ప్రారంభించారు.
వారంలో మూడు రోజులు
ప్రతీవారంలో మూడు రోజుల అధికారులు ‘విద్యుత్ అధికారుల ప్రజాబాట’కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో వీరు గ్రామాలను పర్యటిస్తారు. ఎస్‌ఈ, ఏడీఈ, ఏఈ, లైన్‌మెన్ మొదలుకుని ఆర్టీజన్ స్థాయి సిబ్బంది వరకు అందరూ పర్యటించనున్నారు. నేరుగా క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి నెట్‌వర్క్ తనిఖీలు చేయనున్నారు. వినియోగదారుల నుంచి సలహాలు, ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు. విద్యుత్ అధికారులు నేరుగా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు విద్యుత్ సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకోనున్నారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో ప్రజలు వివరించిన ఆయా సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు. గ్రామానికి వెళ్లిన సందర్భంగా రెండు ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఈ పనులు చేపడతారు. అప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టే పనులు చేస్తూ ఖర్చుతో కూడుకొని ఉన్న పనులు, ఉన్నతాధికారులకు నివేదించే పనులు ఏమైనా ఉంటేపై అధికారులకు నివేదించనున్నారు. మొత్తమ్మీద నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. స్థానికంగా ప్రజలు, కాలనీల వాసులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునే వీలుంది. సమస్యల పరిష్కారంతోపాటు విద్యుత్ పరంగా ఫిర్యాదులు కూడా తగ్గి నెట్‌వర్క్ బలపడి విద్యుత్ నష్టాలు తగ్గుతాయని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.
సమస్యల పరిష్కారం
ఏబీ స్విచ్, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పొందల తొలగింపు, ఎర్తింగ్ లోపాల సవరణ, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద విద్యుత్ సరఫరాకు ఇబ్బందికరంగా మారిన చెట్ల కొమ్మల నరికివేత, లైన్ల మరమ్మతులు, ఇళ్లకు విద్యుత్ సరఫరా పరంగా ఉన్న వైర్లలో ఇబ్బందులు ఉంటే సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంబాల వద్ద ఉన్న విద్యుత్ డబ్బాలు, ఫీజులు మరమ్మతులు లాంటి సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తారు.
ఉన్నతాధికారి నుంచి కింది సిబ్బంది వరకు పర్యటన
ప్రజల నుంచి ఫిర్యాదులూ స్వీకరణ


