
రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి కేవీకే ఆధ్వర్యం ఆరుగురు వ్యవసాయ యువ శాస్త్రవేత్తలు బుధవారం తునికిలో పర్యటించారు. కేవీకే హెడ్‌అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో 115వ ఫౌండేషన్ కోర్స్ ఫర్ అగ్రికల్చర్ సర్వీసెస్‌లో భాగంగా కొత్తగా నియామకమైన వివిధ రాష్ట్రాలకు చెందిన యువ శాస్త్రవేత్తలు వచ్చారు. ఇందులో సందీప్ (ఆంధ్రప్రదేశ్), రణబీర్ (పశ్చిమబెంగాల్), గోపాల కృష్ణ (తమిళనాడు), లావణ్య (తెలంగాణ), రవిప్రకాష్ (ఉత్తరప్రదేశ్), రుచిత(కర్ణాటక) ఉన్నారు. వీరంతా గ్రామంలో నెలరోజులపాటు పర్యటించి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం సేకరించి రైతులతో చర్చించనున్నట్లు కేవీకే శాస్త్రవేత్త రవికుమార్ తెలిపారు. అనంతరం యువ శాస్త్రవేత్తలను గ్రామస్తులకు పరిచయం చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సౌజన్య, మాజీ సర్పంచ్ సాయిలు, మానిక్యరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.