
విప్లవాత్మక అభివృద్ధి
● ముమ్మరంగా ఆరుగ్యారంటీల అమలు
● సమస్యల పరిష్కారంలో ముందంజ
● ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి వివేక్ వెంకటస్వామి
మెదక్‌జోన్: ఎందరో మహానుబావుల త్యాగఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 రాష్ట్రంలో కీలకమైందని, ఈ ప్రాంతం దేశంలో విలీనమై 77 ఏళ్లు గడుస్తుందన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం సొంతం కావడానకి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, మల్లుస్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి పోరాటం చేశారన్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ, హోంమంత్రి వల్లబాయ్ పటేల్ కృషితో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైందన్నారు.
హామీల అమలుకు కృషి
రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారంటీల అమలుతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉందని మంత్రి వివేక్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. ఊరూరా ఇందిరమ్మ గ్రామసభలను నిర్వహించి ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 3.55కోట్ల మంది మహిళలు ప్రయాణించగా.. ఆర్టీసీకి రూ. 87.81 కోట్లు ఆదా అయిందని మంత్రి వివరించారు. అలాగే గృహాజ్యోతి పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,27,381 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లలోపు జీరో బిల్లు జారీచేసింది. తద్వారా లబ్ధిదారులకు రూ 69.19 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందన్నారు.
అభివృద్ధికి పెద్దపీట
రుణమాఫీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 87,491 మంది రైతులకు గానూ రూ.645.41 కోట్ల రుణమాఫీ చేసిందని మంత్రి వివేక్ అన్నారు. అలాగే రైతు భరోసా పథకంలో భాగంగా 2025 ఏడాదికి గానూ 2,62,043 మంది రైతులకు రూ 220.84 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసిందన్నారు. అదే విధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా రూ. 5 లక్షల నుంచి రూ 10 లక్షలకు పెంచిందన్నారు. దీంతో జిల్లాలో 25,826 మంది పేదలు చికిత్స పొందగా.. రూ.68.84 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అంతే కాకుండా జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి నూతన భవన నిర్మాణం కోసం రూ. 180 కోట్లు, నార్సింగ్ కాలేజీ బిల్డింగ్ కోసం రూ. 26 కోట్లు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో 1,26,796 మంది వినియోగదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లను రూ. 500 చొప్పున అందించినట్లు తెలిపారు. అలాగే జిల్లాలో 18,130 కొత్త కార్డులను అందించి వారికి సెప్టెంబర్‌లో 598 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసిందన్నారు. విద్యాశాఖ అభివృద్ధికి కృషి చేసిందన్నారు. 74,265 వేల మంది విద్యార్థులకు 2 జతల స్కూల్ యూనిఫాం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మరమ్మతుకు రూ. 3.26 కోట్లు, కొత్తగా యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేశామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 9,154 ఇళ్లు మంజూరు చేయగా.. రూ. 457.70 కోట్లు విడుదల చేసిందన్నారు. అలాగే మహిళాశక్తి భవననిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించి పనులు చేపట్టామన్నారు. అలాగే వడ్డీలేని రుణాల కింద 10,574 మంది మహిళా సంఘాలను రూ. 21.69 కోట్ల వడ్డీరాయితీ అందించామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వార ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ అభివృద్ధికి రూ. 35 కోట్లు, మెదక్ చర్చి అభివృద్ధికి రూ. 29.18 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివేక్ పేర్కొన్నారు. అంతకు ముందు తెలంగాణపై కళాకారులు ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసినిరెడ్డి, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.
తాత్కాలిక మరమ్మతులకు రూ.10కోట్లు
మెదక్ కలెక్టరేట్: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టానికి శాశ్వతంగా చేపట్టే పనులపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, విద్యాశాఖ, మెడికల్ అండ్ హెల్త్, వ్యవసాయం, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ, మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారులతో వరద నష్టం అంచనాలపై సమీక్షించారు. మెదక్ జిల్లాను వరద నష్టాల నుంచి సాధారణ స్థితికి వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్, డీఆర్‌ఓ భుజంగరావు, ఇతర శాఖల జిల్లా అధికారులు నివాళులర్పించారు.
ఇసుక మాఫియా అంతానికే ఇసుక బజార్లు
నర్సాపూర్: రాష్ట్రంలో ఇసుక మాఫియాను అంతం చేయడానికే ప్రభుత్వం ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. బుధవారం నర్సాపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక బజారుతో పాటు రూ. కోటితో నిర్మించిన వైకుంఠధామం ఇందిరమ్మ మోడల్ హౌజ్ వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇసుక మాఫియా అవతారమెత్తారని ఆరోపించారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి పదవి చేపట్టిన తర్వాత ఇసుక మాఫియాను అంతం చేయాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల స్థాయిలో ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు పాడైన రోడ్లు, కల్వర్టులు వివరాలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అధిక నిధులు మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలోని పేద, మధ్య తరగతికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను అందచేసేందుకు ఇసుక బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆర్‌డీఓ మహిపాల్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజుయాదవ్, మైనింగ్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీకాంత్, ఇసుక బజార్ ఇన్‌చార్జ్ రాకేష్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రసంగిస్తున్న మంత్రి వివేక్