
విచ్చలవిడిగా జూదం!
అనేక అడ్డాలు..!
● జిల్లాలో 8 నెలల్లో 481 కేసులు నమోదు
● దాడులకు వెరవని పేకాటరాయుళ్లు
● ఇటీవల పట్టుబడిన ఇద్దరు పోలీసులు
పేకాట సరదాగా మొదలై.. ఆ తర్వాత బానిసై జేబులను గుల్లచేస్తోంది. జిల్లాలో వాణిజ్య వ్యాపారులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు జోరుగా ఆడుతున్నట్లు తెలిసింది. కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తున్నా.. పేకాటరాయుళ్లు అడ్డాలు మారుస్తూ ఆటను మాత్రం వదలటం లేదు. కొందరు పోలీసులు సైతం ఈ బాటలోనే పయనిస్తుండటం గమనార్హం.
– మెదక్‌జోన్
జిల్లాలో గతేడాది పేకాట ఆడేవారిపై పోలీసులు 39 కేసులు నమోదు చేసి, 276 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,19,272 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది గడిచిన ఎనిమిది నెలల్లో 481 మందిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి 8,39,467 నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కేవలం 8 మాసాల్లోనే పేకాట ఆడి అరెస్ట్ అయిన వారి సంఖ్య 205కు పెరిగింది. ఈలెక్కన సుమారు రెండింతలు అయింది. గత నెలలో పట్టణంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుబడిన వారిలో ఇద్దరు పోలీసులు సైతం ఉండటం గమనార్హం.
ఉక్కుపాదం మోపుతున్నా..
పేకాట ఆడేవారు ఎంతటి వారైనా వదిలేది లేదని ఎస్పీ ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గత నెలలో మెదక్‌లో పేకాట ఆడేవారిలో ఇద్దరు పోలీసులు సైతం చిక్కారు. విషయం తెలుసుకున్న ఎస్సీ వారిద్దరిని వెంటనే సస్పెండ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. కాగా గతేడాదితో పోలిస్తే పేకాట ఆడుతున్న వారి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది.
ఛిద్రమవుతున్న కుటుంబాలు
పేకాటకు అలవాటు పడిన వారు రూ. లక్షలు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు పోయిన వారు తిరిగి అందులోనే సంపాదించాలనే ఉద్దే శంతో అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుంటున్నా రు. జూదంలో డబ్బులు వచ్చిన వారు మరింత సంపాదించాలనే అత్యాశకు పోయి జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. అప్పులు చేసి స్థిరాస్తులు విక్రయించిన వారు లేకపోలేదు.
పేకాట ఆడేవారు పలు రకాల అడ్డాలను ఎంచుకుంటున్నారు. బడాబాబులు ఏకంగా జిల్లా కేంద్రంలోని పలువురి ఇళ్లలో ఆడుతుండగా, మరికొందరు ఇళ్లను అద్దెకు తీసుకొని వాటినే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. మరికొందరు ఫాంహౌస్‌లు, ఇంకొందరు నిర్మాణాల్లో ఉన్న ఇళ్లు, మండల కేంద్రాలు, గ్రామాల్లో అయితే ఏకంగా పంట పొలాలను స్థావరాలుగా చేసుకున్నట్లు సమాచారం.