
అక్షరాస్యత వైపు అతివలు
● ‘ఉల్లాస్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం
● జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు
● మొదటి విడతలో 33,750 మంది
అక్షరాలు నేర్వని అతివలకు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, లెక్కలు నేర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు జిల్లా పరిధిలోని మహిళా సంఘాల్లో ఉన్న నిరక్ష్యరాసులను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు విద్యావంతులైతే సంఘాలు మరింత పటిష్టంగా కొనసాగి, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
– రామాయంపేట(మెదక్)
జిల్లా పరిధిలోని 13,078 సంఘాల్లో మొత్తం 1,37,255 మంది సభ్యులున్నారు. వీరిలో సుమారు 50 శాతం మేర నిరక్ష్యరాసులన్నారని సమాచారం. వీరిలో అక్షరజ్ఞానం లేని 33,750 మందిని మొదటి విడతలో గుర్తించిన అధికారులు, ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశారు. వీరికి విద్యాబుద్దులు నేర్పడానికి గాను ప్రతి 10 మందికి ఒకరి చొప్పున 4,000 మందికి పైగా వలంటీర్లను నియమించారు. ఈమేరకు మండలాల పరిధిలో ఎంపిక చేసిన సభ్యులకు అక్షర వికాసం అనే పుస్తకాలను అందజేశారు. త్వరలో 100 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, వచ్చే మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానం నేర్పనున్నారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఓపెన్ స్కూల్‌లో పది, ఇంటర్
మహిళా సంఘాల్లో జిల్లా పరిధిలో కనీస పరిజ్ఞానం ఉండి పది, ఇంటర్ పూర్తి చేయని 1,500 మందిని ఎంపిక చేశారు. వీరు పదో తరగతి చదవడానికి గాను రూ. 1,150, ఇంటర్ కోసం రూ. 1,500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఓపెన్ స్కూళ్లలో చదువు చెప్పనున్నారు. ఇందుకోసం జిల్లా పరిధిలో మొత్తం 19 స్కూళ్లను ఎంపిక చేశారు. జిల్లాలో కనీసం రెండు వేల మందిని పది, ఇంటర్ పూర్తి చే యించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.
అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం
మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం తాము మొదటి విడతగా గుర్తించిన వారిని ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశాం. త్వరలో వారికి శిక్షణ ప్రారంభిస్తాం. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయని వారిని సైతం ఓపెన్ స్కూల్‌లో చేర్పించి చదువు నేర్పిస్తాం.
– మురళిమోహన్, జిల్లా వయోజన విద్య సమన్వయ అధికారి

అక్షరాస్యత వైపు అతివలు