
నానోతో మేలు
ఎకరానికి అరలీటర్‌తో లాభాలెన్నో..
మెదక్ కలెక్టరేట్: రైతులు ఎక్కువగా నత్రజని ఎరువులు వాడితే భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. భూసారాన్ని తగ్గించే యూరియాను అధిక మొత్తంలో వాడొద్దని అవగాహన సదస్సులు నిర్వహించి మరీ చెబుతున్నారు. ఇదే సమయంలో భూసారంపై ప్రభావం చూపని ద్రవరూపంలో ఉండే నానో యూరియా వినియోగించాలని సూచిస్తున్నారు. నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉండే ఒక కొత్త నత్రజని ఎరువు. దీని కణాల పరిమాణం 20 నుంచి 50 నానో మీటర్లు మాత్రమే. ఇది ఆకులపై పిచికారీ చేయడం ద్వారా పనిచేస్తుంది. పంట దిగుబడిని సగటున 8 శాతం వరకు పెంచగలదని వివిధ పరిశోధనల్లో తేలిందని వ్యవసాయ శాఖ చెబుతుంది. మొక్కల పోషక వినియోగ సామర్థ్యాన్ని సైతం 80 శాతం వరకు మెరుగుపరుస్తుంది. నానో వాడకం వల్ల రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతాయి. బస్తాలను మోయాల్సిన అవసరం ఉండదు. ఇది మొక్కలకు నిరంతరంగా నత్రజనిని అందించే రిజర్వాయర్‌లా పనిచేస్తుంది. సుస్థిర వ్యవసాయానికి తోడ్పడుతుంది. దీనిని సాధారణ స్ప్రేయర్లతో పిచికారీ చేయవచ్చు. చాలా వరకు పురుగు మందులు, తెగుళ్ల మందులతో కలిపి వాడవచ్చు. మిశ్రమాన్ని కలిపే ముందు ‘జార్ టెస్ట్‘ (గాజు సీసా పరీక్ష) తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. కలుపు మందులతో కలిపి వాడకపోవడమే మంచిది.
పంటకు బహుళ ప్రయోజనం
రైతులకు అవగాహన కల్పిస్తున్నవ్యవసాయ శాఖ
జిల్లాలో పంటల సాగు
వానాకాలం సీజన్‌లో సాగు అంచనా 3.50 లక్షల ఎకరాల్లో జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాని వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పటివరకు అన్ని రకాలు పంటల సాగు 1.38 లక్షలు మాత్రమే సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి, పత్తి పంటలు సాగైనట్లు తెలిసింది.
అందుబాటులో ఉంది
నానో యూరియా జిల్లాలో కావాల్సిన మేర అందుబాటులో ఉంది. గుళికల యూరియాతో పోలిస్తే అత్యధిక ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. నానో యూరియా పిచికారి చేయడం వల్ల కేవలం పంట మాత్రమే వినియోగించుకుంటుంది. భూసారం తగ్గకుండా ఉంటుంది. రైతులు గుళికల యూరియాకు బదులుగా నానో యూరియాను వినియోగించాలి. ఈమేరకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– దేవ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి
అతి తక్కువ ధర
నానో యూరియా వినియోగంతో పంట సాగు ఖర్చు తగ్గుతుంది. అర లీటర్ ద్రావణం 45 కేజీల గుళికల యూరియా బస్తాకు సమానంగా పనిచేస్తుంది. బస్తా యూరియా రూ. 278 కాగా, నానో యూరియా రూ. 225కే అర లీటర్ లభిస్తుంది. దీంతో రైతులకు ఖర్చులు అదా అవుతాయి. మరోవైపు భూసారంపై ఎలాంటి ప్రమాదం చూపకుండా రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఆర్థికంగా లాభదాయకం. నానో యూరియా వినియోగంతో పంటల్లో పచ్చదనం చురుగ్గా పెరుగుతుంది. గుళికల యూరియాను రైతులు పంట సాగుకు రెండు నుంచి మూడుసార్లు వినియోగిస్తున్నారు. ఇందులో నత్రజని 30 నుంచి 50 శాతమే వినియోగంలోకి వస్తుంది. మిగితా ఎరువు వృథాగా పోతుంది. దీంతో నేల, గాలి, నీరు కలుషితం అవుతుంది. నానో యూరియా మాత్రం కేవలం పంటకు మాత్రమే ఉపయోగపడుతుంది.

నానోతో మేలు