
ఖాళీ సీట్ల భర్తీకి నేడు స్పాట్ కౌన్సెలింగ్
రామాయంపేట(మెదక్): గురుకుల కళాశాలల్లో ఖాళీల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర గురుకులాల జోనల్ అధికారిణి ప్రత్యూష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జోన్‌లోని ఐదు జిల్లాల పరిధిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో ఉన్న ఖాళీల భర్తీకి గాను ఆయా కళాశాలల్లోనే కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలో ఒకేసారి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు.
సరిపడా యూరియా నిల్వలు
చేగుంట(తూప్రాన్): జిల్లాలో 3,343 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ అన్నారు. బుధవారం చేగుంటలోని పలు ఎరువుల దుకాణాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోతాదుకు మించి యూరియా వాడకూడదని రైతులకు సూచించారు. పంట కాలంలో రెండు పర్యాయాలు నానో యూరియా వాడాలని సూచించారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, ప్రైవేటు ఎరువులు మందులు బలవంతంగా విక్రయించాలని ప్రయత్నం చేస్తే రైతులు మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమ ంలో మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్, రైతులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
నర్సాపూర్: సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో పర్యటించారు. కాలనీలో మురికి కాలువలు, తాగు నీటి సమస్య, పారిశుద్ధ్యం పనులు సరిగా లేవని కాలనీవాసులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈమేరకు కమిషనర్ స్పందిస్తూ త్వరలో ఆయా సమస్యలు పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
17 అడుగులకు చేరిన పోచారం నీటిమట్టం
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పోచమ్మరాళ్ శివారులో ఉన్న పోచారం డ్యామ్‌కు నీటిమట్టం పెరిగింది. కొన్ని రోజులుగా ఎగువన ఉన్న కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువు, కుంటల నుంచి భారీగా నీరు చేరుతుంది. బుధవారం నాటికి డ్యామ్‌లో 17 ఫీట్ల నీరు చేరింది. మరో మూడున్నర ఫీట్లు చేరితే డ్యామ్ పొంగిపొర్లనుంది.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
హవేళిఘణాపూర్(మెదక్): బీజేపీతోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. బుధవారం పీఎంశ్రీ పథకం కింద మండలంలోని కూచన్‌పల్లి జెడ్పీ పాఠశాలను ఎంపిక చేసి వసతుల కల్పనకు కేంద్రం కృషి చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ రఘునందన్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేసిందని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీపాల్, ఎంఎల్‌ఎన్ రెడ్డి, నవీనచారి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ సీట్ల భర్తీకి నేడు స్పాట్ కౌన్సెలింగ్

ఖాళీ సీట్ల భర్తీకి నేడు స్పాట్ కౌన్సెలింగ్