
అమృత్.. ఆలస్యం
● మెదక్ బల్దియాలో ప్రారంభం కాని పనులు
● రామాయంపేట, తూప్రాన్‌లోకొనసాగుతున్న పనులు
● నర్సాపూర్‌లో అర్థ్ధాంతరంగా ఆగిన వైనం
● తాగునీటికి తప్పని తిప్పలు
మెదక్‌జోన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది అధికారుల పరిస్థితి. మున్సిపాలిటీల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గతేడాది అమృత్ (అటల్ మిషన్) పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. కానీ, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఆయా బల్దియాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పటం లేదు.
రూ. 58 కోట్లు మంజూరు
జిల్లాలో మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలున్నాయి. మున్సిపాలిటీల ప రిధిలోని ప్రజలకు శుద్ధజలాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో నాలుగు మున్సిపాలిటీలకు రూ. 58 కోట్లు మంజూరు చేసింది. ఇందులో అతిపెద్ద మున్సిపాలిటీ మెదక్ బల్దియాకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా 31 లక్షల లీటర్ల సామర్థ్యంతో 6 ట్యాంకులు, 48.83 కిలోమీటర్ల పైపులైన్లు, పలు ట్యాంకుల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉంది. అయితే ఈ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఫలితంగా బల్దియాలో నిత్యం ఏదోఒక చోట తాగునీటి సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. అలాగే నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.12 కోట్లు మంజూరు కాగా, రెండు ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ అందులో ఒకటి 7.50 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మరో ట్యాంకు 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు పనులను ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలంలో ప్రారంభించగా సదరు భూమి యజమాని పనులను నిలిపివేయించాడు. రామాయంపేట మున్సిపాలిటీకి రూ.7 కోట్లు, తూప్రాన్ మున్సిపాలిటీకి రూ.9 కోట్లు మంజూరు కాగా, పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.
అమలెప్పుడో మరి!
శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం కోట్లాది నిధులు మంజూరైనా అవి వృథాగా మగ్గిపోతున్నాయి. ఈ నిధులతో తాగునీటి ట్యాంకుల నిర్మాణాలతో పాటు పైపులైన్లు వేసి వాటికి ఎలకి్ట్రక్ వైర్లను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. దీంతో పైపులైన్ల లీకేజీలు ఏర్పడినా, లేక నీరు తక్కువగా వస్తున్నా పైపులైన్లకు అనుసంధానం చేసిన వైర్‌ద్వారా తెలిసిపోతుంది.
త్వరలో పనులు ప్రారంభం
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, ఇప్పటికే మూడింటిలో పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ మున్సిపాలిటీలో మరో వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తాం.
– మహేశ్‌బాబు, ఈఈ పబ్లిక్ హెల్త్, మెదక్