
తరుణోపాయం
ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లకు రుణం●
● ఆ నిధులతో రోడ్లు వేయించాలని నిర్ణయం
● రోడ్ల అభివృద్ధికి సరికొత్త టెండరు విధానం
● హెచ్‌ఏఎం తొలి విడతలో పలు ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్ల ఎంపిక
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రోడ్ల అభివృద్ధి పనులు చేసేందుకు ఆయా ఇంజనీరింగ్ శాఖలు నూతన టెండరు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం రోడ్ల పనులకు టెండరు నోటిఫికేషన్ జారీ చేసి..తక్కువకు బిడ్ వేసిన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్ చేసి పనులు చేయించేవారు. పనులు పూర్తయ్యాక బిల్లులు చెల్లించడం ప్రస్తుతం ఉన్న విధానం. అయితే ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో చాలామంది కాంట్రాక్టర్లు రోడ్ల పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. రోడ్లు భవనాల శాఖలో ఒక్కో పనికి గతంలో పది పర్యాయాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా ఒక్క కాంట్రాక్టర్ కూడా బిడ్ వేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసేందుకు సాహసించడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తగా హెచ్‌ఏఎం (హైబ్రీడ్ అన్యూటీ మోడ్) అనే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విధానం ప్రకారం కాంట్రాక్టర్లకు ఆయా రోడ్డు పనుల అంచనా వ్యయంలో 60% మొత్తానికి ప్రభుత్వమే ష్యూరిటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. మిగిలిన 40% మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చి కాంట్రాక్టరుతో పనులు చేయించాలని నిర్ణయించింది.
26 ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.523 కోట్లు
నూతన విధానం హెచ్‌ఏఎం మొదటి విడతలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 26 రోడ్లను ఎంపిక చేశారు. మొత్తం 387 కి.మీల పొడవున్న ఈ రోడ్ల అభివృద్ధికి సుమారు రూ.523 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు.
సిద్దిపేట జిల్లాకు 25 రోడ్లను ఎంపికయ్యాయి. రూ.379 కోట్లతో 289 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాకు సంబంధించి సుమారు 18 రోడ్లు ఎంపికై నట్లు సమాచారం.
ఎంపిక చేసిన రోడ్లలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారులు, అలాగే మండల కేంద్రం నుంచి నేషనల్ హైవే వరకు ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి ఉన్న రోడ్లు, అలాగే మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ఉన్న రహదారులను ఎంపిక చేసినట్లు ఆర్‌అండ్‌బీ పర్యవేక్షక ఇంజనీర్ వసంత్‌నాయక్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్ రోడ్లు సైతం
ఈ నూతన టెండరు విధానంతో పంచాయతీ రాజ్ రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం 105 రోడ్లను ఎంపిక చేశారు. 343 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
15 సంవత్సరాల నిర్వహణ బాధ్యతలు
పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 30 నెలల్లో పనులు పూర్తి చేయాలి. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లకే ఆయా రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. మొత్తం 15 సంవత్సరాల వరకు ఈ నిర్వహణ సదరు కాంట్రాక్టరే చూసుకోవాలి. రోడ్డు వేసిన ఏడేళ్లకు ఒకసారి బీటీ రెన్యూవల్ చేయాలి. అలాగే 14వ సంవత్సరంలో మరోసారి బీటీ రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది.