
ఆర్టీసీ అదిరే టూర్
దర్శనీయ స్థలాలకు ప్రత్యేక ప్యాకేజీ●
● నేటి నుంచి ప్రయాణం
● జిల్లా నుంచి ఆరు క్షేత్రాలకు..
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు విహార యాత్రలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలపైనే ఆసక్తి చూపుతారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ తన వ్యూహం మార్చింది. ప్రయాణికులను ఆకర్షించడంతో పాటు.. సంస్థ ఆదాయం పెంచుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించింది. విహార యాత్రలకు బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుణ్యక్షేత్రాలకు నేరుగా బస్సులు లేక పోవడంతో చాలా మంది ప్రజలు రెండు, మూడు బస్సుల్లో ప్రయాణించి ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పుణ్యక్షేత్రాలకు టూర్ బస్సులను సిద్ధం చేసి నడిపిస్తోంది. ఫలితంగా అటు ఆర్టీసీకి ఆదాయం పెరగడంతోపాటు పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారికి సౌకర్యం కలిసొస్తుంది.
జిల్లా నుంచి ప్రత్యేకంగా..
జిల్లాలోని ప్రజలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఆర్టీసీ మంచి అవకాశం కల్పిస్తుంది. దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికోసం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా టూరు బస్సులు నడిపించేందుకు సంస్థ సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే ప్రజల నుంచి బుకింగ్‌లు స్వీకరిస్తుంది. ఈనెల 30న మెదక్ ఆర్టీసీ డిపో నుంచి ఆరు పుణ్యక్షేత్రాలకు టూర్ బస్సు బయల్దేరనుంది. ఇందుకోసం బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్టీసీ సంస్థ తన ఆదాయ మా ర్గాల అన్వేషణలో భాగంగా ఈ టూర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత కొన్ని పుణ్యక్షేత్రాలకు నాలుగు బస్సులు వెళ్లివచ్చాయి.
టూర్ బస్సు వెళ్లే పుణ్యక్షేత్రాలు
సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలోని కేతకి సంగమేశ్వరస్వామి ఆలయం, రేజింత్‌లోని సిద్ధ వినాయక ఆలయం, బీదర్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గానుగాపూర్‌లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం నుంచి పండరిపూర్ రాత్రి అక్కడే ఉండి ఈనెల 31న రెండో రోజు ఉదయం పండరిపురిలో గల శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం, తుల్జాపూర్‌లోని తుల్జావాని మాత దర్శనం చేయిస్తారు. అనంతరం తిరిగి రాత్రి బయలుదేరి మెదక్‌కు చేరుకుంటుంది.
చార్జీలు
పెద్దలకు ఒకరికి రూ.1700, పిల్లలకు రూ.1000 చార్జీ ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు టిఫిన్, భోజనం, దర్శన టికెట్ ఖర్చులు ఎవరికి వారు భరించుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు ఐదు టూర్లు
మెదక్ ఆర్టీసీ డిపో నుండి మొత్తం ఐదు ట్రిప్పులు టూర్ వెళ్లి వచ్చాయి. అందులో యాదగిరిగుట్టకు నాలుగు బస్సులు, ఆరుణాచలంకు ఒక బస్సు వెళ్లి వచ్చింది. ఒక్కో బస్సులో 55 ప్రయాణికులను తీసుకెళుతారు.
ఆదరణ బాగుంది
ఆర్టీసీ నడిపిస్తున్న పుణ్యక్షేత్రాల టూర్ బస్సులకు మంచి ఆదరణ లభిస్తుంది. ఒకే రోజు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. జిల్లా నుంచి ఫుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భక్తులు ఆర్టీసీ సూచించిన నంబర్లకు, స్థానిక బస్సు డిపోలో సంప్రదించాలి.
సురేఖ, ఆర్టీసీ డిపో మేనేజర్, మెదక్

ఆర్టీసీ అదిరే టూర్