
పారదర్శకతతో పనిచేయాలి
మెదక్‌జోన్: ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరసమాచార అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. సమాచార కమిషనర్లు, పీవీ శ్రీనివాస్, బోరెడ్డి, అయోధ్యరెడ్డి, మోసిన్ పర్వీన్, వైష్ణవి మేర్ల, దేశాల భూపాల్‌లతో కలిసి ఆయన మంగళవారం మెదక్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు చేయడంలో కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 29 ప్రభుత్వ శాఖల్లో 15 శాఖలలో ఎటువంటి కేసులు లేకపోవడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. గత పదేళ్ల కాలంలో సమాచార కమిషన్ అందుబాటులో ఉంచకపోవడం వల్ల రాష్ట్రంలో 18 వేల కేసులు సమాచార హక్కు చట్టం కమిషన్ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజలు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమాచారం అందజేయాలని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల వద్ద సిటిజన్‌చార్ట్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలయ్యే విధంగా అధికారులకు పలు ఆదేశాలిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలు అడిగిన వెంటనే సమాచారం అందించాలని అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డితోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్య సమాచార
కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి