
చిన్నారులకు పాలు, అల్పాహారం!
అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు మరింత బలవర్ధకమైన ఆహారం ఇచ్చే విషయమై మాతా, శిశు సంక్షేమశాఖ కసరత్తు చేస్తుంది. వారిలో రక్తహీనత, పోషకాహార లోపం తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం వారికి ఇస్తున్న పోషకాహారానికి తోడు ఉదయం పాలు, అల్పాహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లాలోని 20,244 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది.
– రామాయంపేట(మెదక్)
జిల్లాలో 1,076 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, 5,0030 మంది విద్యార్థులున్నాయి. వీరిలో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 29,786 మంది ఉండగా, వీరికి టీహెచ్‌ఆర్ (టేక్ హోం రేషన్) కింద నెలకు 16 కోడిగుడ్లతో పాటు రెండున్నర కిలోల బాలామృతం ప్యాకెట్ ఇస్తున్నారు. మిగితా 20,244 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డుతో పాటు ఒక పూట పౌష్టికాహారం అందజేస్తున్నారు. వారు ఇళ్లకు వెళ్లిన తర్వాత సరైన అహారం తీసుకోకపోవడంతో చాలా మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో ఎదుగుదలను అంచనా వేయడానికి అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి నెల కొలతలు తీస్తున్నారు. కేంద్రాల్లోని చిన్నారుల వయసుకు, ఎత్తుకు తగిన బరువు లేరని, పోషకాహార లోపం తలెత్తినట్లు సర్వేలో తేలింది. ఈలోపాన్ని అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
కొత్త మెనూ ప్రకారం
కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వస్తే మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారానికి తోడు ఉదయం అల్పాహారంగా ఉప్మా, వంద మి.లీ. పాలు ఇవ్వనున్నారు. దీంతో చిన్నారుల్లో పోషకాహార లోపం అధిగమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మెనూ అమలైతే వారిలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది. రక్త హీనతను నివారించడంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడనుంది.
అంగన్‌వాడీలో
ఉదయం అందించేలా చర్యలు
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
జిల్లాలో 20,244 మందికి లబ్ధి
జిల్లా వివరాలు
అంగన్‌వాడీ కేంద్రాలు 1,076
విద్యార్థుల సంఖ్య 50,030
ఏడు నుంచి మూడేళ్ల్లలోపు పిల్లలు 29,786
మూడు నుంచి ఆరేళ్లలోపు వారు 20,244
అదనంగా అల్పాహారం
మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు అంగన్‌వాడీ చిన్నారులకు ప్రస్తుతం ఇస్తున్న పౌష్టికాహారానికి తోడు అదనంగా అల్పాహారం ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది అమలైతే పిల్లలకు వరం. ఒక్కో విద్యార్థికి వంద మి.లీ. పాలు, ఉప్మా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.
– హైమావతి, జిల్లా సంక్షేమాధికారిణి

చిన్నారులకు పాలు, అల్పాహారం!