
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: అర్జీలను పరిష్కరించడంలో వివిధశాఖల అధికారులు బాధ్యతాయుతంగా పని చేయా లని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వా రం వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పుడు ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. మొత్తం 120 అర్జీలు రాగా, అందులో 50 భూ సమ స్యలపైనే రావడం విశేషం. వీటితో పాటు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ త్వరతిగతిన పరిష్కారం చూపి ప్రజలకు జవాబు చెప్పాలని ఆదేశించారు. మెదక్ మండల పరిధిలోని రాయిన్‌పల్లి శివారులో 365 ఎకరాల వ్యవసాయ భూములను కొంతమంది కబ్జా చేసినట్లు బుడగ జంగాల కుటుంబాలు ఫిర్యాదు చేశారు. అలాగే చేగుంటకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తమకు ఉచిత ఇసుకకు అనుమతి ఇప్పించాలని కోరారు. గత డిసెంబర్ నుంచి బిల్లులు రావడం లేదని, వెంటనే మంజూరు చేయించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య పాల్గొన్నారు.
పదేళ్లుగా తిరుగుతున్నా..
మూడెకరాల భూమికి పట్టాదార్ పాస్‌పుస్తకం కోసం పదేళ్లుగా తిరుగుతున్నా. ధరణి వచ్చినప్పుడు కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చారు. కానీ మాకు రాలేదు. ఇప్పటికీ కాస్తులోనే ఉన్నాం. నాటి నుంచి నేటి వరకు కలెక్టర్లకు ఫిర్యాదులు అందజేస్తున్నా.. పరిష్కారం చూపడం లేదు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే కలెక్టరేట్‌లోనే బైఠాయిస్తా.
– లక్ష్మి, చేగుంట మండలం చందంపేట

అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు