
యూరియా ఉందయా..
మెదక్‌జోన్: రాష్ట్రంలోని అనేక జిల్లాలో యూరియా కోసం షాపుల ముందు క్యూలైన్లు కడుతున్నారు. ఆధార్‌కార్డులు, భూమి పట్టాపాస్ పుస్తకాలు పట్టు కుని వెళ్తున్నారు. కానీ మెతుకు సీమలో మాత్రం ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఎక్కడాలేదు. యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి సాగు 3.05 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా మిగతా 45 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నాయి. కాగా, ఇప్పటివరకు జిల్లాలో అన్నిరకాల పంటలు 1,38,783 ఎకరాల్లో సాగయ్యాయి. వాటిలో పత్తిసాగు 35వేల ఎకరాలు సాగు కాగా మొక్కజొన్న 2,500 కందులు 1,500 ఎకరాలతో పాటు కూరగాయలు, జొన్నలు, రాగులు ఇతర పంటలు మరో 6 వేల ఎకరాల్లో సాగయ్యాయి. మిగతా 93,783 ఎకరాల్లో వరి సాగైంది. కాగా, అన్ని రకాల పంటలకు కలిసి యూ రియా సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
3,900 ఎంటీఎస్ నిల్వలు
ఇప్పటికే జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు 10 వేల మెట్రిక్‌టన్నుల (ఎంటీఎస్) యూరియాను రైతులు వినియోగించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 37 పీఏసీఎస్‌లలో 1,400 ఎంటీఎస్ నిల్వలు ఉండగా ప్రైవేట్ డీలర్స్ వద్ద 905 ఎంటీఎస్, మార్కెఫెడ్‌శాఖ అధీనంలో 1,595 ఎంటీఎస్ యూరియా నిల్వలున్నాయి. ఇంకా జిల్లాకు 11,700 ఎంటీఎస్‌ల యూరియా అవసరం ఉంటుందని, విడతలవారీగా అవసరం మేరకు తెప్పిస్తామని సంబంధిత ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం 3,900 ఎంటీఎస్‌ల నిల్వలు
మరో 11,700 ఎంటీఎస్ అవసరం
వదంతులు నమ్మొద్దంటున్న అధికారులు
వదంతులు నమ్మొద్దు
యూరియా కొరత ఉందని కొంత మంది పనికట్టుకుని చేసే వదంతుల్ని రైతులెవరూ నమ్మొదు. యూరియా అవసరమైతే పీఏసీఎస్‌లలో, ప్రైవేట్ డీలర్లవద్ద, మార్కెఫెడ్‌లలో సరిపడా ఉంది తీసుకోవచ్చు. తప్పుడు మాటలు నమ్మి యూరియా దొరుకుతుందో లేదోనని అవసరం కన్నా ఎక్కువగా కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ ఉంచకండి. అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి.
– దేవ్‌కుమార్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి మెదక్
అవసరం ఇలా...
కాగా యూరియా ఎకరం వరికి 2–3 బస్తాలు అవసరం ఉంటుంది. అలాగే మొక్క జొన్నకు, 3 బస్తాలు, కూరగాయలకు, పత్తికి మాత్రం 2 బస్తాల చొప్పున అవసరం అవుతుంది. ఇందులో వరికి రెండు సార్లు చల్లుతారు. నాట్లు వేసిన 15–20 రోజుల వ్యవధిలో ఒక్కసారి చల్లాలి. పొలంలో కలుపు తీశాక 45 రోజుల వ్యవధిలో మరోసారి చల్లాల్సి ఉంటుంది. అలాగే మొక్కజొన్న కాస్త పెరిగాక ఒక్కసారి అనంతరం గింజదశలో మరోసారి వేయాల్సి ఉంటుంది. కూరగాయలు, ఇతర పంటలకు సైతం రెండు సార్లు యూరియా వేయాల్సి ఉంటుంది. యూరియా వేస్తేనే పంట ఎదుగుదల ఉంటుంది. అందుకే యూరియాకు అంతటి ప్రత్యేకత ఉంటుంది.

యూరియా ఉందయా..