
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రమైన మెదక్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం గ్రామ పాలన అధికారి, లైసెన్స్‌డ్ సర్వేయర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష కేంద్రాన్ని ఆర్టీఓ రమాదేవి, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ప్రిన్సిపాల్ హుస్సేన్, ల్యాండ్ సర్వే ఏడీ, పోలీసు అధికారులతో కలిసి డీఆర్‌ఓ భుజంగరావు సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ భుజంగరావు మాట్లాడుతూ...ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 73 మంది అభ్యర్థులకు గాను, 63 మంది హాజరైనట్లు తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరిగిన పరీక్షకు 113మంది అభ్యర్థులకు గాను 105మంది హాజరు కాగా మరో 8 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే పరీక్షను పోలీసు బందోబస్తు మధ్య కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. అనంతరం పరీక్ష మెటీరియల్‌ను హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూకు తరలించినట్లు తెలిపారు.
డీఆర్‌ఓ భుజంగరావు