
రైతన్న కన్నీళ్లు
ఘనపురం ప్రాజెక్టు
ఘనపూర్ రైతన్నల గోస
మంజీర నదిపై 1905లో తొలిసారి ఘనపురం ప్రాజెక్టు, 1923లో నిజాంసాగర్ ఏర్పాటైంది. అనంతరం 1989లో సింగూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. సింగూరు నిల్వ నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు. సింగూరు నిర్మాణం తర్వాత ఘనపురం ప్రాజెక్టుకు ఏటా 4 టీఎంసీలు, నిజాంసాగర్‌కు7, త్రాగునీటికి 4 ,డెడ్‌స్టోరేజీ 8, ఆవిరిగా మారేది 7 టీఎంసీలుగా నిర్థారించారు. అయితే ఘనపురం ప్రాజెక్టుకు ఎప్పుడు నీరు వదలాలన్నా ప్రతి యేడు ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత, అలాంటి జీఓలు లేకుండానే అవసరానికనుగుణంగా నీళ్లు వదిలేవారు. 2017లో 16.5 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు ఉంటేనే, దిగువకు వ్యవసాయ అవసరాల కోసం నీరు వదలాలని పేర్కొన్నారు.
సింగూరు కాల్వలకు విడుదల చేసి..
సింగూరులో ప్రస్తుతం 18.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఘనపురం ప్రాజెక్టుకు సాగు నీరు వదలాలని, వారం రోజుల క్రితం పాపన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లా మంత్రికి టేక్మాల్‌లో విజ్ఞప్తి చేశారు. అయితే త్రాగునీటిని దృష్టిలో పెట్టుకుని నీరు విడుదల చేయడం కష్టమేనని మంత్రి అన్నట్లు తెలిసింది. కాగా రెండు రోజుల వ్యవధిలో సింగూరు ప్రాజెక్టు నుంచి ఎత్తి పోతల పథకం ద్వారా ఎడమ కాల్వలోకి నీరు వదలడంపై ఘనపురం రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా కనీసం 0.3 టీఎంసీల చొప్పున 1 టీఎంసీ నీరు విడుదల చేసినా వరి నాట్లు వేసుకుంటామని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ఆనకట్టకింద నార్లు ముదిరిపోతున్నాయని వాపోతున్నారు. ఇదే విషయమై ఈ నెల 14 నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు పద్మారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలసి సింగూరు నీరు విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించారు.
ఘనపురం రైతులకు తప్పని పోరాటాలు
జాడలేని వానలు..
ముదురుతున్న వరి నార్లు
సింగూరులో 18.6 టీఎంసీల నీరు
కనీసం ఒక టీఎంసీ నీరు విడిచినా
యాసంగి గట్టెక్కుతామంటున్న రైతులు
గుది బండగా మారిన
16.5 టీఎంసీల జీవో
మడుగు నీళ్లున్నప్పుడు కూడా వదిలారు
2004లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సింగూరు ప్రాజెక్టులో 6.7 టీఎంసీల నీరు నిల్వ ఉన్నప్పుడు కూడా ఘనపురం పంటలకోసం నీళ్లు వదిలారు. జూన్ రెండో వారంలో 0.3 టీఎంసీల నీరు వదిలి ఘనపురం ప్రాజెక్టు క్రింద ఉన్న వరి తుకాలకు నీరు అందించారు. ఇప్పుడు వరి తుకాలు ముదిరిపోతున్నాయి. వెంటనే నీరు వదిలి రైతులను రక్షించాలి.
– సత్తయ్య, రైతు, పైతర

రైతన్న కన్నీళ్లు