
ఎదురు చూపులు బోనస్
ధాన్యం విక్రయించి రెండు నెలలు
● జిల్లావ్యాప్తంగా 6.27 లక్షల క్వింటాళ్ల సన్నాలు విక్రయం ● రూ.31.37 కోట్ల బకాయిలు
రెండు ఎకరాల్లో సన్నాల సాగు
నాకు ఉన్న 2 ఎకరాలలో సన్నాలను సాగు చేశాను. ఎకరాకు 18 క్వింటాళ్ల చొప్పున రెండు ఎకరాలకు 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.16 వేలు రావాల్సి ఉంది.
– శ్రీనివాస్‌రెడ్డి, రైతు
మెదక్‌జోన్: సన్నధాన్యం విక్రయించి రెండు నెలలు గడిచినా వాటికి ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ డబ్బులు కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రబీసీజన్‌లో 2,75,601 ఎకరాల్లో వరిసాగు చేయగా 31,373 ఎకరాల్లో 14,966 మంది రైతులు సన్నాలు సాగుచేశారు. ఇందుకు సంబంధించి ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున 6,27,474 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌డబ్బులు రూ.31.37 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. కాగా యాసంగి ముగిసి ఇప్పటికి రెండు నెలలు గడిచిపోతుండటంతో బోనస్ డబ్బుల ఊసే ప్రభుత్వం ఎత్తకపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
సన్నాలకు పెట్టుబడి అధికం
దొడ్డురకం వరిసాగుతో పోల్చితే సన్నాలకు పెట్టుబడితో పాటు నీటితడులు సైతం అధికంగా అవసరం ఉంటుంది. అంతే కాకుండా సన్నాలకు తెగుళ్లు సైతంఅధికంగా ఆశించటంతో పాటు సన్నవరి దొడ్డుదాని కన్నా 15 రోజులు ఆలస్యంగా పంట చేతికందుతుంది. దొడ్డురకం దిగుబడి ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్విటాళ్ల వరకు వస్తే సన్నధాన్యం ఎకరాకు 20 క్వింటాళ్లు మించి దిగుబడి రాదు. దొడ్డురకానికి ఒకటిలేదా రెండుసార్లు తెగుళ్లకు మందులు పిచికారీ చేస్తే సన్నాలకు 3–4 సార్లు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. రసాయన మందులను సైతం అధికంగా వాడాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా దొడ్డురకం వరిసాగుకు ఎకరాకు రూ.12 వేల నుంచి రూ.15 వేల పెట్టుబడి అయితే సన్నాలకు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. బోనస్ డబ్బులు వస్తాయనే ఆశతో కొంత రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపితే డబ్బులు రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.
విత్తన కంపెనీలదీ అదేతీరు
జిల్లాలో పుట్టగొడుగుల్లా పలురకాల విత్తన కంపెనీలు వస్తున్నాయి. మా కంపెనీ విత్తనం సాగు చేస్తే ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ రైతుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని గత రబీలో సీజన్‌లో జిల్లాలో 6,678 ఎకరాలలో పలు కంపెనీలు విత్తన సీడ్స్‌ను సాగుచేయించారు. కాగా, యాసంగి సీజన్ ముగిసి రెండు మాసాలు గడిపోయింది. ఇప్పటికి 3 వేల ఎకరాలకు సంబంధించిన డబ్బులు మాత్రమే రైతులకు ఇవ్వగా ఇంకా 3,678 ఎకరాలకు సంబంధించిన డబ్బులు రైతులకు రావాల్సి ఉంది. దీంతో డబ్బులు ఎప్పుడిస్తారంటూ ఆందోళన చెందుతున్నారు.
మూడెకరాల్లో విత్తన సాగుచేశాను
విత్తనాలు సాగు చేస్తె ఎకరాకు రూ.80 వేల చొప్పున ఇస్తామని ఓ విత్తన కంపెనీకి చెందిన వ్యక్తి చెబితే మూడెకరాల్లో విత్తన సాగు చేశాను. పంట చేతికంది 2 మాసాలు గడిచి పోయింది. ఇప్పటికీ సదరు కంపెనీ డబ్బులు ఇవ్వలేదు.
– పోచయ్య, రైతు, చందాపూర్

ఎదురు చూపులు బోనస్

ఎదురు చూపులు బోనస్