21న చైన్నెలో జరిగిన ఎన్నికల్లో విజయం
మెదక్‌జోన్: మెదక్ చర్చి ఇన్‌చార్జి బిషప్‌గా కొనసాగుతున్న రెవరెండ్ డాక్టర్ రూబెన్ మార్క్ చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సినాడ్)కు మోడరేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ నెల 21న చైన్నెలో సీఎస్‌ఐ మోడరేటర్ పదవికోసం నిర్వహించిన ఎన్నికల్లో కేరళ చర్చికి చెందిన రెవరెండ్ బిషప్ నిత్యానంద శర్మపై 77 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సీఎస్‌ఐ మోడరేటర్‌గా ఎన్నికకావటంతో రూబెన్‌మార్క్‌ను మెదక్ చర్చి సంఘ బాధ్యులు గంట సంపత్, సంజయ్, ప్రభాకర్, సుశీల్, సూరజ్ తదితరులు చైన్నెలో ఘనంగా సన్మానించారు. కాగా, ఎస్‌ఐ మోడరేటర్‌గా ఎన్నికై న రూబెన్‌మార్క్ ఈ నెల 24న మెదక్ చర్చికి రానున్నారు. అనంతరం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారని చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి శాంతయ్య మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
రైతులకు అన్యాయం: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
పెద్ద శంకరంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌పార్టీ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేటలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎంతోమంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభిస్తే దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు..
ఆస్పత్రి తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ
రామాయంపేట(మెదక్): పట్టణంలోని గణపతి ఆయుర్వేదిక్ క్లినిక్‌ను మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిల తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆస్పత్రికి ఎటువంటి అనుమతులు లేకపోవడంతోపాటు అనుమతులు లేని ఆయుర్వేద మందులను గుర్తించారు. జిల్లా వైద్యాధికారికి నివేదిక అందజేస్తామని ప్రగతిధర్మారం ఆస్పత్రి డాక్టర్ హరిప్రియ తెలిపారు. కాగా, ఎలాంటి అనుమతులు లేకపోయినా పైల్స్ ఆపరేషన్ చేసి తమను ఇబ్బందులపాలు చేసిన వైద్యుడు ప్రదీప్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సదరు క్లినిక్‌పై నార్సింగికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు, వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అధిక ధరలకు అమ్మితే చర్యలే
నర్సాపూర్: ఎరువులను ఎవరైనా అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి హెచ్చరించారు. ఏఓ దీపికతో కలిసి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలు మంగళవారం ఆమె తనిఖీ చేసి పలు రికార్డులు, స్టాకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రిజిష్టర్లలో ప్రతీరోజు స్టాకు నమోదు చేయడంతోపాటు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో రిపోర్టులు అందచేయాలన్నారు. రైతులందరు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కోసం తమ పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. మండలంలో ఇప్పటివరకు 6,925మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు.