
కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్ట్
● అందుబాటులో 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా ● కలెక్టర్ రాహుల్‌రాజ్
శివ్వంపేట(నర్సాపూర్): జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. శివ్వంపేటలోని పీఏసీఎస్ కేంద్రంలోని యూరియా స్టాక్‌ని మంగళవారం పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ఉన్న యూరియా రికార్డులో నమోదు చేసిన దాంట్లో వ్యత్యాసమున్నట్లు గుర్తించి సిబ్బందిని తీవ్రంగా మందలించారు. హమాలి సంచికి రూ.10 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ప్రస్తుత సీజన్‌కు సంబంధించి యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని ఎవరైనా యూరియా అందుబాటులో లేనట్లు తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీరోజు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌శాఖ సిబ్బంది ఎరువుల పంపిణీని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. పంపిణీలో ఎదైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ప్రతీ దుకాణం వద్ద యూరియాకు సంబంధించి స్టాక్ బోర్డు తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్‌రామిరెడ్డి, ఏఓ లావణ్య, సీఈఓ మధు, తదితరులున్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
నర్సాపూర్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయం ను ఆయన తనిఖీ చేసి పలు రికార్డులు పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, శానిటేషన్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు గుర్తించి ఆయిల్స్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయాలని, తడి పొడి చెత్త వేరు చేసి సేకరించాలని ఆదేశించారు. ఆయన వెంట వ్యవసాయ సహకార సంఘం సీఈఓ మధు ఉన్నారు. కాగా స్థానిక మున్సిపాలిటీలో చేపడుతున్న కార్యక్రమాలను కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.