
హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు
వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ నవోదయ వేదికగా కొనసాగుతున్న ప్రీ సుబ్రతో జాతీయ ఫుట్‌బాల్ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. టోర్నీలో రెండోరోజు మంగళవారం షిల్లాంగ్, పాట్నా రీజియన్లు ఆధిపత్యం ప్రదర్శించాయి. అండర్–17, అండర్–15 రెండు విభాగాల్లోనూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. తుదిపోరులో సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నారు.
రెండోరోజు విజేత జట్లు
అండర్–15 విభాగం నుంచి పట్నా, షిల్లాంగ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరాయి. లీగ్ మ్యాచ్‌లలో షిల్లాంగ్ జట్టు పూణె జట్టును 9–0, చండీఘర్ జట్టును 5–0 గోల్స్‌తో చిత్తుచేసింది. చండీఘర్ జట్టు 3–0తో జైపూర్‌ను, లక్నో జట్టు 2–0 గోల్స్‌తో పాట్నాను, భోపాల్ జట్టు 2–1తో హైదరాబాద్‌ను ఓడించాయి. భోపాల్, లక్నో జట్ల మధ్య 2–2 గోల్స్‌తో మ్యాచ్ టై అయింది. అదే ఒరవడిలో జైపూర్, పూణె జట్ల మధ్య మ్యాచ్ కూడా 0–0 గోల్స్‌తో టై అయింది. సెమీఫైనల్‌లో పాట్నా 4–0 గోల్స్‌తో లక్నోను ఓడించి ఫైనల్‌కు చేరుకోగా, మరో సెమీఫైనల్‌లో షిల్లాంగ్ 4–1 గోల్స్‌తో లక్నోను ఓడించి ఫైనల్‌కు చేరింది.
అండర్–17 విభాగంలో..
అండర్–17 విభాగంలోనూ షిల్లాంగ్, పాట్నా జట్లే ఫైనల్‌కు చేరాయి. రెండోరోజు లీగ్ మ్యాచ్‌లలో పాట్నా 9–0 గోల్స్‌తో జైపూర్‌ను, 2–0 గోల్స్‌తో చండీఘర్‌ను ఓడించింది. షిల్లాంగ్ 6–0 గోల్స్‌తో హైదరాబాద్‌ను, చండీఘర్ 7–1 గోల్స్‌తో భోపాల్‌ను ఓటమిపాల్జేశాయి. లక్నో 3–1 గోల్స్‌తో పూణెను, భోపాల్ 1–0 తో జైపూర్‌ను ఓడించాయి. సెమీఫైనల్స్‌లో షిల్లాంగ్ 3–1 గోల్స్‌తో చండీఘర్‌ను, రెండో సెమీఫైనల్‌లో పాట్నా, లక్నో మ్యాచ్ టై కాగా పెనాల్టీ షూటవుట్ ద్వారా 4–2 గోల్స్‌తో పాట్నా ఫైనల్‌కు చేరింది. ఫైనల్స్‌లో షిల్లాంగ్, పాట్నా తలపడనున్నాయి.