బఫర్‌లో బరితెగింపు!
దుర్గమ్మ సాక్షిగా భూ దందా
● అక్రమార్కులకు అడ్డాగా టేకులగడ్డ ● ఏడుపాయల్లో అక్రమ నిర్మాణాలు ● ఎన్‌ఓసీ లేకుండానే కార్యదర్శుల అనుమతులు
ఏడుపాయల రియల్ మాఫియాకు కేంద్రంగా మారింది. దుర్గమ్మ సాక్షిగా అవినీతి భూ దందా కొనసాగుతోంది. పచ్చని వనాలతో కళకళలాడిన టేకులగడ్డ.. అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది. మంజీరా తీరాన ఉన్న బఫర్ జోన్‌లో బరితెగించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎన్‌ఓసీ లేకుండానే రెవెన్యూ, పంచాయతీ అధికారులు కాసుల వేటలో అడ్డగోలు అనుమతులిస్తున్నారు. 1 నుంచి 8, 144, 145 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమిలో అక్రమ రియల్ భూం కొనసాగుతుంది.
– పాపన్నపేట(మెదక్)
మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే సుందర ప్రదేశం వనదుర్గానిలయం. తలాపునే 30 వేల ఎకరాలకు సాగు నీరందించే ఘనపురం ప్రాజెక్టు.. దిగువన భక్తులు స్నానాలు చేసేందుకు.. వృధాజలాన్ని ఒడిసి పట్టేందుకు చెక్ డ్యాం నిర్మించారు. నదికి ఇరువైపులా కొల్చారం మండలంలో 1 నుంచి 8, పాపన్నపేట మండలంలో 144, 145 సర్వే నంబర్లలో ఉన్న సుమారు 30 ఎకరాల భూమి పచ్చని చెట్లతో కళకళలాడేది. 2015– 16లో పోతంషెట్‌పల్లి నుంచి వచ్చే దారిలో మంజీరా నదిపై 3 బ్రిడ్జిలు నిర్మించి డివైెడర్లతో కూడిన సీసీ రోడ్లు వేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి ఈ భూములపై పడింది. అప్పట్లో ఎకరాకు రూ. 2.30 లక్షలు ధర పలికిన ఈ భూములు .. ప్రస్తుతం రూ. 2.50 నుంచి రూ. 3 కోట్లు పలుకుతున్నాయి. అవసరానికనుగుణంగా భూములు కొనుగోలు చేసిన రియల్టర్లు బఫర్ జోన్‌లో వాణిజ్య నిర్మాణాలు ప్రారంభించారు. అనేక లాడ్జీలు నిర్మించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు.
నిర్మాణాలు గుర్తించాం
ఏడుపాయల్లో మంజీరా నది తీరాన బఫర్ జోన్‌లో ఉన్న 8 నిర్మాణాలను గుర్తించాం. సంబంధిత యజమానులకు నోటీసులు అందించాం. ఇంతవరకు ఏడుపాయల్లో ఎలాంటి నిర్మాణాలకు ఇరిగేషన్ శాఖ నుంచి నో అబ్జెక్షన్ అనుమతి తీసుకోలేదు. పోతంషెట్‌పల్లి నర్సాపూర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుంది. బఫర్‌జోన్‌లో నాలా చేయొద్దు, నిర్మాణాలు అక్రమం. వీటిపై తగిన చర్యలు తీసుకుంటాం.
– విజయ్, ఇరిగేషన్‌శాఖ ఏఈ
బఫర్‌లో బరితెగింపు!


