ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు
ఖానాపూర్: మహాశివరాత్రి సందర్భంగా పట్టణ సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహించే గోదావరి నది వద్ద పవిత్ర స్నానాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షవర్లు ఏర్పాటు చేశారు. పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇందుకోసం ముందు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిసరప్రాంత ప్రజలు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
భక్తులకు తప్పని ఇక్కట్లు
ఖానాపూర్‌లోని ఉత్తరవాహిని గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆదివారం శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తారు. మున్సిపల్ అధికారులు కనీసం కాలినడకన వెళ్లే మార్గంలో మరమ్మతు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు, పలుమార్లు బండరాళ్ల మధ్యలో పడి గాయాలైన సందర్భాలు ఉన్నాయి.


