
వన్యప్రాణుల నిలయం.. కవ్వాల్
జన్నారం: కవ్వాల్ అభయారణ్యాన్ని 1965లో వన్యప్రాణుల విభాగం (వైల్డ్‌లైఫ్)గా ఏర్పాటు చేశారు. వాటి రక్షణకోసం 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. పులుల సంఖ్య పెంచడానికి 2012లో నేషనల్ టైగర్ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల రక్షిత ప్రదేశం (టైగర్‌జోన్)గా ఏర్పాటు చేసింది. కవ్వాల్ టైగర్‌జోన్ 893 చదరపు కిలోమీటర్లలో కోర్ ఏరి యా, 1,123 చదరపు కిలోమీటర్లలో బఫర్ ఏరియాగా గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా టైగర్‌జోన్ విస్తరించి ఉంది. ఇందులో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవించేందుకు అటవీశాఖ అధికా రులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ టైగర్‌జో న్ ఏర్పాటు నుంచి వన్యప్రాణులకు రక్షణ కవచంగా మారింది. కఠిన చట్టాలను అమలు చేయడంతో క్రమేపీ వన్యప్రాణుల వేట తగ్గుముఖం పట్టింది.
గడ్డిక్షేత్రాలతో పెరిగిన సంఖ్య
జన్నారం అటవీ డివిజన్‌లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఐదేళ్లుగా అడవుల్లోకి పశువులు వెళ్లకుండా కట్టడి చేశారు. ఆహారం, ఆవాసం, నీరు కల్పించడం ద్వారా వన్యప్రాణుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో జన్నారం డివిజన్‌లోని 40 బీట్‌లలో అవి ఇష్టపడే పలురకాల గడ్డిని పెంచడం, నీటి కుంటల నిర్మాణం, అలజడి లేకుండా ఆవాసం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన శాఖాహార జంతువుల సర్వే ద్వారా వన్యప్రాణుల సంఖ్య రెట్టింపు అయినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల సంఖ్య వివరాలను అధికారులు విడుదల చేయాల్సి ఉంది.
కఠినమైన చట్టాలు
వన్యప్రాణులను వేటాడినా వాహనంతో ఢీకొట్టి చంపినా 1972 ఆక్ట్ ప్రకారం 6 నెలల నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. షె డ్యూల్ 1 కిందికి వచ్చే పులి, చిరుత, ఎలుగుబంటిలాంటి జంతువులను వేటాడితే ఎనిమిదేళ్ల జైలుశిక్ష, షెడ్యూల్ 2 కిందికి వచ్చే జంతువులను వేటాడితే 6 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష ఉంటుంది.
వారోత్సవాలు
వన్యప్రాణుల రక్షణ, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా అక్టోబర్ 2 నుంచి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తున్నా రు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. జంతువులను వేటాడితే పడే శిక్షల గురించి వివరిస్తున్నారు. రెండేళ్లుగా కేసులు తగ్గుముఖం పట్టినా ఇటీవలి కాలంలో మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది.
వివిధ రకాల వన్యప్రాణులకు పుట్టినిల్లు కవ్వాల్ అభయారణ్యం. ఈ అడవిలో చుక్కల దుప్పులు, నీలుగాయిలు, దుప్పులు, సాంబర్లు, కొండగొర్రెలు, జింకలు, నక్కలు, కుందేళ్లు, ముళ్లపందులు, పందులు లాంటి వన్యప్రాణులతో పాటు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, అడవి కుక్కలు లాంటి వన్యమృగాలు కూడా జీవిస్తున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 8 వరకు వన్యప్రాణుల వారోత్సవాలు నిర్వహిస్తుండగా నేటితో ముగియనున్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వన్యప్రాణుల చట్టాలు, శిక్షల గురించి సిబ్బంది అటవీ సమీప గ్రామాల్లో వివరిస్తున్నారు. విద్యార్థి దశనుంచే వన్యప్రాణుల చట్టాలు, రక్షణ గురించి తెలిసేందుకు పోటీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. వన్యప్రాణులు, అడవులను రక్షించుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమవుతుంది. భవిష్యత్ తరాలకు ఈ వనసంపదను మిగిల్చిన వారమవుతాం.
– రామ్మోహన్, ఎఫ్‌డీవో

వన్యప్రాణుల నిలయం.. కవ్వాల్

వన్యప్రాణుల నిలయం.. కవ్వాల్