
దాడి కేసులో యువకుల అరెస్టు
జైపూర్: దాడి కేసులో మండలంలోని కుందారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శ్రీధర్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కుందారం గ్రామానికి చెందిన దాసరి నరేశ్, మారెం అజయ్, బోగే ప్రశాంత్‌లు చెడు వ్యసనాలకు బానిసై గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్నారు. గత నెలలో జక్కం అంజన్నకు చెందిన ఆటోను ఇంటి నుంచి దొంగిలించారు. ఆటో అదుపుతప్పి బోల్తాపడగా మళ్లీ తీసుకొచ్చి ఇంటి వద్ద పెట్టి పారిపోయారు. ఇదే విషయాన్ని అంజన్న ప్రశ్నించగా ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 4న అర్ధరాత్రి అంజన్న ఇంటికి వచ్చి మూడు సీసీ కెమెరాలను పగులగొట్టి అతడిపై దాడి చేసి పారిపోయారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.