
ఆర్టీసీకి పండుగ
మంచిర్యాలఅర్బన్: బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరి పండుగ చేసుకుంది. దసరా ముందు, తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడిపించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి జిల్లా నుంచి రాజధానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఉద్యోగం, చదువు రీత్యా హైదరాబాద్‌కు వెళ్లిన వారు సొంతూళ్లకు వచ్చి వెళ్లడానికి బస్సుల రాకపోకలకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది దసరా సందర్భంగా రోజువారీ బస్సులతోపాటు అదనపు బస్సులు తిప్పడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగడంతోపాటు సంస్థకు ఖజానా సమకూరింది. ఉమ్మడి జిల్లా నుంచి ఆయా డిపోల ద్వారా హైదరాబాద్‌కు దసరా ముందు, తర్వాత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6వరకు 998 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. 5,10,072 కిలోమీటర్లు నడపడం ద్వారా 1,39,388 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో రూ.3,01,08,462 ఆదాయం సమకూరింది.
దసరా ముందు.. తర్వాత
దసరా పండుగకు ముందు ఉమ్మడి జిల్లా(రీజియన్) నుంచి ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి 399 ప్రత్యేక బస్సులు నడిపించారు. ఏడు సూపర్ లగ్జరీ(మంచిర్యాల డిపో)లు, 43 సూపర్‌లగ్జరీలు, 23 డీలక్స్, 241 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సులు నడిపారు. 2,05,348 కిలోమీటర్ల మేర బస్సులు నడపడం ద్వారా 56,467 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,16,02,891 ఆదాయం చేకూరింది. పండుగ తర్వాత ఈ నెల 3నుంచి 6వరకు రీజియన్ వారీగా 599 బస్సులు నడిపారు. ఇందులో 15రాజధాని, 192 సూపర్‌లగ్జరీ, 38 డీలక్స్, 354 ఎక్స్‌ప్రెస్ బస్సులు తిప్పారు. అదనపు బస్సులతో 3,04,724 కిలోమీటర్లు నడిపి 82,921 మంది గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,85,05,571 ఆదాయం వచ్చింది.
అధికంగా మంచిర్యాల డిపో నుంచే..
పండుగ నేపథ్యంలో ఆయా డిపోల నుంచి మొత్తంగా 998 బస్సులు నడిపించగా.. ఇందులో అధికంగా మంచిర్యాల డిపో నుంచే 198 బస్సులు ఉన్నాయి. 11,701 మంది మహాలక్ష్మి పథకం ప్రయాణికులు కాగా, 11954మంది టికెట్లు కొనుగోలు చేశారు. 98,867 కిలోమీటర్లు మేర బస్సులు తిప్పి 23,655 మంది ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.62,70,066 ఆదాయం వచ్చింది. దసరా ముందు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ ఒకటి వరకు 120 బస్సులు 59536 కిలోమీటర్లు నడపడం ద్వారా 14,575 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో మహాలక్ష్మి పథకం 8192 మంది, 6,950 మంది టికెట్ల కొనుగోలు చేసి ప్రయాణం చేశారు. రూ.35,92,471 సమకూరింది. దసరా తర్వాత ఈ నెల 3 నుంచి 6వరకు 8,513 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.26,77,595 ఆర్జించింది. దసరా ముందు, తర్వాత వచ్చిన ఆదాయంలో ఆదిలాబాద్ రీజియన్ వారీగా పరిశీలిస్తే మంచిర్యాల డిపో ముందుంది.