
టేకు చెట్ల నరికివేత
జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పరిధిలో స్మగ్లర్లు టేకుచెట్లను నరికివేస్తున్నట్లు తెలుస్తోంది. తాళ్లపేట్ అటవీ రేంజ్‌లోని తానిమడుగు, చింతపల్లి ప్రాంతాల్లో విలువైన టేకుచెట్లు నరికివేతకు గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొండుగూడ బీట్‌లోని గొండుగూడ, జువ్విగూడ, పైడిపెల్లి ప్రాంతాల్లో సుమారు 20 వరకు టేకుచెట్లు నరికివేతకు గురైనట్లు తెలుస్తోంది. గ్రామాల సమీపం నుంచే చెట్లను నరికి కలపను తరలించుకుపోయారు. జువ్విగూడకు చెందిన ఓ వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగి మూడు రోజులవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై జన్నారం ఇన్‌చార్జి రేంజ్ అధికారి మమతను ఫోన్‌లో సంప్రదించగా, చెట్లు నరికివేసిన వ్యక్తిని గుర్తించామన్నారు. శాఖపరమైన సమావేశాల కారణంగా చర్యలు తీసుకోకపోయామని, తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.