
ఇందిరమ్మ ఇల్లు ఒకరికి.. బిల్లు మరొకరికి
ఇచ్చోడ: ఇందిరమ్మ ఇల్లు ఒకరికి మంజూరైతే పంచాయతీ కార్యదర్శి బిల్లు మరొకరికి అందజేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లే నందబాయి భర్త సంతోష్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజురైంది. జూన్ 2న కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే గ్రామంలో ముస్లే నందబాయి భర్త మారుతికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయితే పంచాయతీ కార్యదర్శి సునీల్ నాయక్ నిర్వాకం వల్ల బేస్‌మెట్ వరకు నిర్మాణం పూర్తయిన నందబాయి (భర్త మారుతి)కి వచ్చే బిల్లు ఇంకా పనులు ప్రారంభించని నందబాయి (భర్త సంతోష్) బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ అయ్యాయి. ఈ బిల్లు విషయంలో గ్రామంలో పక్షం రోజులుగా రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. కాగా, కార్యదర్శి తన తప్పు సరిదిద్దుకోవడానికి మరో తప్పు చేసి వివాదానికి తెరలేపాడు. డబ్బులు ఖాతాలో జమ కావాలంటే బ్యాంక్ వోచర్‌పై సంతకాలు పెట్టాల్సి ఉంటుందని నందబాయి, ఆమె భర్త సంతోష్‌ను ఇచ్చోడ బ్యాంక్‌కు పిలిపించాడు. ఈ నెల 3న వోచర్లపై సంతకాలు తీసుకొని ఆమె అకౌంట్‌లో జమ అయిన డబ్బులను నందబాయి భర్త మారుతి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించాడు. విషయం బయటకు పొక్కడంతో సంతోష్‌తో పాటు గ్రామస్తులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కార్యదర్శిని నిలదీశారు. దీంతో కార్యదర్శి తన తప్పు ఒప్పుకొని వారం రోజుల్లో నందబాయి భర్త సంతోష్‌కు రూ.లక్ష ఇస్తానని ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో సంతోష్ రెండు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎంపీడీవో అనంద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇద్దరు లబ్ధిదారుల పేర్లు ఒకేలా ఉండటంతో ఒకరికి వచ్చే బిల్లు మరొకరి అకౌంట్‌లో జమ అయినట్లు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.