
విద్యార్థినికి పరీక్ష ప్యాడ్ అందజేస్తున్న ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజలకు చేరువైన సంక్షేమ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
మంచిర్యాల అగ్రికల్చర్: అనతికాలంలోనే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమంతోపాటు అన్ని రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
రేషన్‌కార్డులు పంపిణీ
జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు 26,510 నూతన రేషన్‌కార్డులు అందించడంతోపాటు 60,790మంది పేర్లు చేర్చాం. జిల్లాలో 2,47,923 మంది కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. పోర్టబులిటీ విధానం ద్వారా ఏ ప్రాంతంలోనైనా రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకునే వీలు కలిగింది.
ఇందిరమ్మ ఇళ్లు
అర్హులైన నిరుపేదలను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి మొదటి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసి శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 10,503 ఇళ్లు మంజూరు కాగా, 6,682 గ్రౌండింగ్, 3,464 బేస్‌మెంట్, 400 గోడలు, 107 స్లాబ్ నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. లబ్ధిదారుల ఖాతాలో రూ.33.39 కోట్లు జమ చేశాం.
రాజీవ్ ఆరోగ్యశ్రీ
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. జిల్లాలో 28,280 మంది పేదలు చికిత్స పొందారు. ఇందుకు గాను రూ.63.71 కోట్లు ఖర్చు చేశాం.
మహాలక్ష్మీ పథకం
మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. జిల్లాలో 2.36 కోట్ల మంది మహిళలకు రూ.85.83 కోట్లు లబ్ధి చేకూరింది. రూ.500కే వంటగ్యాస్ సరఫరా ద్వారా మహిళలపై పడే ఆర్థిక భారం తగ్గించి, జిల్లాలో 1,22,837 మంది లబ్ధిదారులకు రూ.14.63 లక్షలు రాయితీ మంజూరు చేశాం.
గృహజ్యోతి..
200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా ప్రతీ నెల లక్ష నివాసాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఇప్పటివరకు 1,26,358 మంది వినియోగదారులకు రూ.81.50 కోట్లు లబ్ధి చేకూర్చాం.
భూభారతి
భూభారతి నూతన చట్టంపై ప్రతీ మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. 51,503 దరఖాస్తులు రాగా 26,744 అంగీకరించి పరిశీలనలో ఉన్నాయి. గ్రామస్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసం 168 క్లస్టర్లకు గ్రామ పాలన అధికారులను నియమించాం.
చేరువైన వైద్యం..
జిల్లాలో ప్రజలకు వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తోంది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.300 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి భవన నిర్మాణం, నర్సింగ్ కళాశాల భవనానికి రూ.40 కోట్లు మంజూరు చేయగా పనులు సాగుతున్నాయి. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో అధునాతన వైద్య కళాశాల నిర్మాణం జరుగుతోంది.
విద్యారంగం బలోపేతం
జిల్లాలో 510 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి మిగతా పాఠశాలల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల విద్యార్థులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 40శాతం డైట్, 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంచి నూతన మెనూ అమలు చేస్తూ, సకాలంలో పౌష్టికాహారం అందించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి జిల్లాలోని దండేపల్లి మండలం రెబ్బెనపల్లి, చెన్నూర్ మండలం సోమనపల్లి, బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేస్తున్నాం. హాజీపూర్, దండేపల్లి, కన్నెపల్లి, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో కేజీబీవీలను ఇంటర్మీడియెట్ కళాశాలలుగా నవీకరించాం.
● జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రోడ్డు, రైలు రవాణా వ్యవస్థ, నీటి పారుదల, ఖనిజ వనరులు జిల్లా అభివృద్ధిలో ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి. గూడెం సత్యనారాయణస్వామి, వేలాల రాజరాజేశ్వరస్వామి ఆలయాలు, ఎల్లంపల్లి జలాశయం, కవ్వాల్ అభయారణ్యం, గాంధారి ఖి ల్లా, గాంధారి వనం పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీసీపీ ఎగ్గడి భాస్కర్, అటవీ శాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పబ్లిక్ టాయిలెట్స్, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. మంచిర్యాలలో రూ.10.22 కోట్ల వ్యయంతో అత్యుత్తమంగా మహా ప్రస్థానం నిర్మించాం. అమృత్ 2.0 పథకం కింద అన్ని మున్సిపాలిటీలకు రూ.275 కోట్లు మంజూరు చేసి పురోగతిలో ఉన్నాయి.
రైతులకు రుణమాఫీ
రాష్ట్రంలో 25.35లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు రుణమాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం మన రాష్ట్రం చేసి చరిత్ర సృష్టించింది. రైతుల విషయంలో రాజీలేని రుణవిముక్తులను చేసి అత్యధికంగా పంట పండించే దిశగా ప్రోత్సహిస్తోంది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12వేలు పెట్టుబడి సాయం, పరిమితి లేకుండా అందించాం. జిల్లాలో వానాకాలం పంటకు 1,52,162 మంది రైతులకు రూ.198.13 కోట్లు అందించాం. రైతు బీమా పథకం కింద 83,114మంది రైతులను చేర్చి ఇప్పటివరకు 347మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.17.35కోట్లు అందజేశాం. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేసి సన్నరకానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాం.