
ప్రబలుతున్న డెంగీ జ్వరాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రాంతంలో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పంజా విసురుతున్నాయి. పారిశుద్ధ్యం లోపించి, వర్షాలతో నీరు స్థిరంగా నిలిచి దోమలు వృద్ధి చెందడం వల్ల జ్వరాలు వ్యాపిస్తున్నాయి. గత రెండు నెలలో వ్యవధిలో నిర్వహించిన డెంగీ ర్యాపిడ్ టెస్టులో 28మందికి పాజిటివ్ రాగా, మరో 25మంది మలేరియా బారిన పడ్డట్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించుకోగా బయటపడిన కేసులు కాగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న వారి సంఖ్య ఇంతకు రెట్టింపుగా ఉన్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్‌సెంటర్, బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రబలే డెంగీ, మలేరియా జ్వరాలపై ప్రజలకు కనీస అవగాహన కల్పించకపోవడం, ముందస్తు చర్యలపై శ్రద్ధ వహించకపోవడం వల్ల వ్యాధులు విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది.
వైద్య శిబిరాలపై నిర్లక్ష్యం
ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రికార్డు అవుతున్న డెంగీ, మలేరియా జ్వరాల గణాంకాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గత జూలైలో బెల్లంపల్లి టేకులబస్తీలో ఓ చిన్నారికి డెంగీ పాజిటివ్ రాగా బస్తీలో వైద్య శిబిరం నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇతర ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా
ఆస్పత్రిలో జ్వరాల కేసులు
నెల డెంగీ ర్యాపిడ్ మలేరియా
పాజిటివ్
జూలై 17 15
ఆగస్టు 10 6
సెప్టెంబర్ 1 4 (15వ వరకు)
భయభ్రాంతులకు గురికావద్దు
వర్షాలు విస్తారంగా కురుస్తుండడం వల్ల ఇళ్లు, పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, టైర్లు, డ్రమ్ములు, కూలర్లలో దోమలు వృద్ధి చెంది జ్వరాల వ్యాప్తికి కారణమవుతాయి. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. డెంగీ పాజిటివ్ నిర్ధారణ జరిగితే వెంటనే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దు.
– డాక్టర్ సుధాకర్‌నాయక్,
డెప్యూటీ డీఎంహెచ్‌ఓ, బెల్లంపల్లి