
చెన్నూర్‌లోనూ బాధితులు
చెన్నూర్: చెన్నూర్ పట్టణ ప్రజలు మొన్నటి వరకు వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడగా.. ప్రస్తుతం డెంగీ ఫీవర్ వణికిస్తోంది. గత పక్షం రోజులుగా జ్వరాల బారిన పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని లైన్‌గడ్డ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరితోపాటు మరో కుటుంబానికి చెందిన ఒకరికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ముగ్గురు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలంలో దోమల నివారణ చేపట్టాల్సిన అధికారులు నామమాత్రంగా ఫాగింగ్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే వారు కరువయ్యారు. చెత్తకుప్పలు కుళ్లిపోతున్నా తొలగించడం లేదు.
దళితవాడలను పట్టించుకోరు
కాలనీలో మురికి కాలువలు నిండి కంపుకొడుతున్నా, ముళ్ల పొదలు పెరిగి దోమలు విజృంభిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేరు. మెయిన్ రోడ్లలో డ్రైనేజీలు శుభ్రం చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దళితవాడలను పట్టించుకున్న పాపాన పోలేదు. దళితవాడల్లో దోమల నివారణ చర్యలు చేపట్టి రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి. – తగరం అశోక్, ఇందిరనగర్ కాలనీ
చెత్త తీసేటోళ్లు లేరు..
కాలనీల్లో చెత్త తీసేటోళ్లు వస్తలేరు. గతంలో ప్రతీరోజు చెత్త బండ్లు వచ్చేవి. ఆరు నెలల నుంచి వారానికి ఒక్క రోజు వచ్చిన దాఖలాలు లేవు. చెత్త తీయకపోవడంతో వర్షాలకు కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పన్నుల వసూలుకు వత్తుండ్లు. ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తలేరు. అధికారులు స్పందించి కాలనీలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. – ఎస్‌డీ.జాకీర్, లైన్‌గడ్డ

చెన్నూర్‌లోనూ బాధితులు