
సొంతింటి పథకం అమలుకు కృషి
శ్రీరాంపూర్: కార్మికుల చిరకాల కోరిక అయిన సంతింటి పథకం అమలుకు కృషి చేస్తున్నామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య తెలిపారు. శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో శనివారం నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ఇటీవల జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో సొంతింటి పథకం, అలవెన్స్‌లపై ఆదాయ పన్ను చెల్లింపులు వంటి ప్రధాన డిమాండ్లకు యాజమాన్యం ఒప్పుకుందన్నారు. సొంతిల్లు నిర్మించుకొన్న వారికి కంపెనీ క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపిందన్నారు. డిస్మిస్ అయిన జేఎంఈటీలకు తిరిగి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్‌రెడ్డి, బద్రి బుచ్చయ్య, నాయకులు తిరుపతి, సాయిరాజ్, రాజకుమార్ పాల్గొన్నారు.
రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య
ఆదిలాబాద్‌టౌన్: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ ఇన్‌చార్జి టి.ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహరాష్ట్రలోని భోకర్‌కు చెందిన సాయినాథ్ సుంగుర్వాడ్ (40) గత కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. శనివారం తెల్లవారుజాము 3.30 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫాం–1 రైలు పట్టాలపై తలపెట్టాడు. ఆదిలాబాద్ నుంచి పర్ణి వెళ్లే ప్యాసింజర్ రైలు వెళ్లడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.