
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
జైపూర్: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గంగిపల్లిలో పల్లె దవాఖాన, కుందారం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్లు, ఆస్పత్రి పరిసరాలు పరిశీలించారు. రోగులకు పరీక్షలు, అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని తెలిపారు. జైపూర్, గంగిపల్లిలో పల్లె దవాఖానలో విధులకు గైర్హాజరైన వైద్యులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గంగిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలించారు. జైపూర్‌లో కస్తూర్భాగాంఽధీ విద్యాలయాన్ని సందర్శించారు. వంటశాల, మరుగుదొడ్లు, తరగతి గదులు, పరిసరాలతోపాటు అదనపు భవన నిర్మాణ పనులు పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యంశాలు బోధించి వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. స్థానిక గురుకులాలను సందర్శించి పలు సూచనలు చేశారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
మంచిర్యాలటౌన్/మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన వైద్యం అందించడంతోపాటు వైద్యులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, పరీక్షలపై అవగాహన కల్పించాలని సూచించారు. పోషకాహార లోపం, రక్తహీనత ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి ఆరోగ్య స్థితి సాధారణ స్థితికి వచ్చేలా, సాధారణ ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచిర్యాలలోని కేజీబీవీని సందర్శించి అదనపు గదుల నిర్మాణంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అమలవుతుందా అని అడిగి తెలుసుకున్నారు.