
తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం
● జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు ● ఈ నెల 7వరకు కార్యక్రమాలు
జిల్లా వివరాలు
మంచిర్యాలటౌన్: జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లా శిశు, మహిళా, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలింతలు, గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాముఖ్యతను చాటేలా ఈ నెల 7వరకు వారోత్సవాలు నిర్వహిస్తారు. పుట్టినప్పటి నుంచే బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే ముర్రుపాలను కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందుతాయి. సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ఈ పాలల్లో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. తల్లిపాల వారోత్సవాలపై ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్ సమావేశం నిర్వహించారు. తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బాలింతలు తప్పకుండా తెలియజేయాలని సూచించారు.
అంగన్‌వాడీకేంద్రాలు : 976
బాలింతలు : 3,889
గర్భిణులు : 3,328
చిన్నారులు : 29,916