కడెం ప్రాజెక్టులో అనేక ఏళ్లుగా పేరుకుపోయిన పూడికతీత (సిల్ట్)కు టెండర్ ఖరారైనట్లు సమాచారం. పూడికతీతతో కడెం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగనుందని ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
కడెం: కడెం నదిపై ఎత్తయిన సహ్యాద్రి కొండలను ఆనుకుని 9 వరద గేట్లతో 1958లో ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అదే ఏడాది సామర్థ్యానికి మించి వరద రావడంతో ప్రాజెక్ట్ తెగిపోయింది. కడెం ప్రాజెక్ట్‌కు వచ్చే ఇన్‌ఫ్లో అంచనా వేసినా అప్పటి ప్రభుత్వం మరో 9 వరద గేట్లను పెంచి ప్రాజెక్ట్ ఔట్ ఫ్లో సామర్థ్యాన్ని 3 లక్షల వరకు పెంచింది. కడెం ప్రాజెక్టు నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని 68,150 ఎకరాలకు సాగు నీరందిస్తుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు(7.603 టీఎంసీ). ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో చెత్తాచెదారం, మట్టిని ఎప్పటికప్పుడు బయటకు విడుదల చేసేందుకు అప్పటి ఇంజినీర్లు ప్రాజెక్ట్ అడుగుభాగాన గేట్లను ఏర్పాటు చేశారు. కానీ వాటిని ఆపరేట్ చేయకపోవడంతో తుప్పుపట్టిపోయాయి. దీంతో కాలక్రమేణా ప్రాజెక్ట్‌లో సుమారు 4 టీఎంసీల మేర పూడిక ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టు నిండా పూడిక పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు కింద ఒకేపంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తుంది.
ఎట్టకేలకూ మోక్షం..
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడిక తీయాలని గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కడెం ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ పూడికతీత పనులకు టెండర్ దక్కించుకున్నట్లు సమాచారం. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికతీత 15 నుంచి 20 ఏళ్లలోపు దశలవారీగా చేపట్టనున్నారు. పూడికతీత ప్రక్రియలో భాగంగా పూడికలో ఇసుక, పొలాలకు సారవంతమైన మట్టి, గ్రావెల్ మూడు భాగాలుగా వేరు చేయనున్నారు. కడెం ప్రాజెక్టు పూడికతీత ద్వారా సుమారు రూ.200 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు సమాచారం.
కడెం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక
సమాచారం లేదు
కడెం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక తీసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్‌లో సిల్ట్ పేరుకుపోవడంతో నీటినిల్వ సామర్థ్యం తగ్గింది. టెండర్ ప్రక్రియ అనేది కరీంనగర్‌లో జరుగుతుంది. దీనిపై ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు.
– నవీన్, డీఈఈ, కడెం


