నాలుగు వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

నాలుగు వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి

Jun 21 2026 6:46 AM | Updated on Jun 21 2026 6:46 AM

మరో ముగ్గురికి గాయాలు

జడ్చర్ల: పట్టణంలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జయప్రసాద్‌ కథనం మేరకు.. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు అల్యూమినియం లోడ్‌తో మినీ గూడ్స్‌ వాహనం వెళ్తుండగా తెల్లవారు జామున జడ్చర్ల వద్ద ముందు వెళ్తున్న డీసీఎం అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో గూడ్స్‌ వాహన డ్రైవర్‌ బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో వెనుక వస్తున్న మరో డీసీఎం గూడ్స్‌ వాహనాన్ని ఢీకొట్టగా దాని వెనుక వస్తున్న బొలెరో వాహనం డీసీఎంను ఢీకొట్టింది. ఇలా వరుసగా నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో గూడ్స్‌ వాహన క్లీనర్‌ మల్లెపోగు వెంకటేశ్వర్లు, డ్రైవర్‌ మహేశ్‌లు తీవ్రంగా గాయపడగా, ఇతర వాహనాల్లో ఉన్న నజీర్‌, ఎండీ థామస్‌ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గూడ్స్‌ వాహన క్లీనర్‌ మల్లెపోగు వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువు నిఖిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రమాదంలో గాయపడిన మహేశ్‌ వద్ద ఉన్న రూ.5.49 లక్షలను గుర్తించిన 108 సిబ్బంది నగదును పోలీసులు, డాక్టర్ల సమక్షంలో వారికి అందజేశారు.

అనుమానాస్పదంగా యువకుడు మృతి

గద్వాల క్రైం: అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని కుంటవీధికి చెందిన శ్రీనివాసరెడ్డి(30) కూలీ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మృతుడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ తెలిపారు.

ఆశా కార్యకర్త ఆత్మహత్య

మక్తల్‌: కాల్వలో దూకి ఆశా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఆశా కార్యకర్త ఆశమ్మ(35) కుటుంబంలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయని, తనకు కూడా ఆరోగ్యం బాలేదని మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి భర్త శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

భార్యకు మరో పెళ్లి..

భర్త ఆత్మహత్య

రాజోళి: భార్య మరో పెళ్లి చేసుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. శాంతినగర్‌ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. బిహార్‌ రాష్ట్రం పాట్నా జిల్లా పూర్‌చోని మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన సంజీవ్‌(28) వడ్డేపల్లి మండలంలోని జిల్లెడుదిన్నె గ్రామానికి చెందిన దస్తగిరి అనే పాడి రైతు వద్ద జీతానికి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి గ్రామంలో ఉండేవాడు. కొద్ది రోజుల కిందట భార్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మరికల్‌: కారు, బైక్‌ ఢీకొని తీవ్రగాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో అర్ధరాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నచింతకుంట మండలం పర్ధిపూర్‌కు చెందిన కుర్వ కురుమూర్తి(27) శుక్రవారం అత్తగారి గ్రామం కొల్లంపల్లికి వెళ్లి తిరిగి పర్ధిపూర్‌కు బైక్‌పై వస్తుండగా మహబూబ్‌నగర్‌ నుంచి మక్తల్‌ వెళ్తున్న కారు పెద్దచింతకుంట స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురెదురుగా ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగ్రాతుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement