పాలమూరు: మహబూబ్‌నగర్ చుట్టూ అనేక రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రైల్వేస్టేషన్లు ఎయిర్‌పోర్టుల మాదిరిగా అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాలు, విప్లవాత్మక మార్పులపై శనివారం రాత్రి నగరంలోని కమల గార్డెన్‌లో మేథావుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అధికారంలో ఉందని వివక్ష చూపితే రాష్ట్రం అభివృద్ధి చెందేది కాదన్నారు. ఏ పథకం తీసుకున్న కులాలకు, మతాలకు అతీతంగా కేంద్రం నిధులు విడుదల చేస్తుందని, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల కోసం 60 శాతం నిధులు కేంద్రం ఇచ్చిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రతిసారి ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడన్నారు. రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్ దుర్మరణం
మహమ్మదాబాద్: ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మండల కేంద్రానికి చెందిన చింతకింది రమేష్ (22) ట్రాక్టర్ నడుపుకుంటూ ముకర్లాబాద్ వైపు నుంచి మహమ్మదాబాద్ వైపునకు వస్తున్నాడు. మార్గమధ్యలో లింగయ్యపల్లి గేటు సమీపంలోకి రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో రమేష్ ట్రాక్టర్‌పై నుంచి కింద పడిపోవడంతో తలకు, శరీరానికి బలమైన రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తూ..
కొత్తకోట రూరల్: కుమారుడి వివాహ శుభలేఖలు బంధువులకు పంచేందుకు వెళ్లిన ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పెళ్లి ఇంట్లో విషాధం నెలకొంది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి స్టేజీ సమీపంలో జాతీయ రహదారి–44పై శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి మండలంలోని మెంటెపల్లికి చెందిన వెంకటయ్య (50) తన కుమారుడి వివాహం ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ద్విచక్ర వాహనంపై మిరాసిపల్లి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిరాసిపల్లి స్టేజీ సమీపంలో మలుపు వద్ద హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం బైక్‌ను బలంగా ఢీకొనడంతో వెంకటయ్యకు తీవ్ర గాయాలై ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న కొత్తకోట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి మార్చురీకి తరలించారు. కుమారుడి పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వెంకటయ్య మృతి చెందడంతో మెంటేపల్లి గ్రామంలోనే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు.


