● అలంపూర్ నుంచి పందుల
బొలెరో అపహరణ
● శాంతిగనర్‌లో పోలీసులపై
ఖాళీ సీసాలతో ఎదురుదాడి
● మరో కోళ్ల బొలెరోతో కర్ణాటక వైపు పరారీ
రాజోళి/అలంపూర్ రూరల్: అర్ధరాత్రి వేళ వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రమైన శాంతిగనర్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. కర్నూల్–రాయచూరు ప్రధాన రహదారి దద్దరిల్లేలా వారు చేసిన బీభత్సంతో ఒక్కసారిగా అటు అలంపూర్, ఇటు వడ్డేపల్లి మండలాలు ఉలిక్కిపడ్డాయి. సినిమా ఫక్కీలా జరిగిన చేజింగ్‌లో పోలీసులను సైతం లెక్కచేయకుండా ఎదరుదాడికి దిగి, కోళ్లకు చెందిన బొలేరోతో పరారయ్యారు. సినిమాలోని ఫైట్ సన్నివేశాలను తలపించేలా జరిగిన ఈ ఘటనపై అలంపూర్ ఎస్‌ఐ రామకృష్ణ, శాంతిగనర్ ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి అలంపూర్ పట్టణంలోని విక్రమ్‌కు చెందిన పందులతో ఉన్న బొలేరోను అపహరించి శాంతిగనర్ వైపు వస్తున్నారు. విషయం తెలసుకున్న బాధితుడు అలంపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు శాంతిగనర్ పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు వాహనం కోసం కాపు కాశారు. శాంతిగనర్‌లోని పోలీస్‌స్టేషన్ సమీపానికి వచ్చాక వాహనం టైర్ పంచర్ కావడంతో వారిని గమనించిన పోలీసులు, ఇతరుల సహాయంతో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఖాళీ సీసాలు, రాళ్లతో పోలీసులపై ఎదురు దాడికి దిగారు. పోలీసులు తేరుకునేలోగా, అదే వాహనాన్ని తీసుకుని శాంతిగనర్‌లోని పలు కాలనీల్లోకి వెళ్తూ రామాపురం రోడ్డు వైపు వెళ్లి నిలిపేశారు. ఆ వాహనం అక్కడే వదిలేసి అక్కడి నుంచి పొలాల గుండా పరారై ఉంటారని పోలీసులు భావించినప్పటికీ, వారి అంచనాలు తలకిందులు చేశారు. ఎనిమిది మందితో కూడిన దోపిడి దొంగల ముఠా, సమీపంలో ఉన్న మంజుల చికెన్ సెంటర్ దగ్గర కోళ్లను షెడ్డులోకి దించుతున్న బొలేరోను గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ పని చేస్తున్న యువకులపై దాడికి దిగారు. అనుకోకుండా జరిగిన దాడితో వారు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. కోళ్ల లోడ్‌తో ధర్మ అనే వ్యక్తికి చెందిన బొలేరోను తీసుకుని కర్ణాటక వైపు పరారయ్యారు. కాగా, వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను పంపినట్లు ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఉలిక్కి పడిన గ్రామాలు
ఘటనతో పలు గ్రామాలు ఉలిక్కి పడ్డాయి. ప్రధాన రోడ్డుపై అరుపులు, కేకలతో జరిగిన ఛేజింగులు గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులనే లెక్క చేయకుండా దాడులకు తెగపడే వారి గురించే శుక్రవారం అందరూ మాట్లాడుకోవడం కనిపించింది. కోళ్ల లోడ్‌తో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లిన దుండగులు అందులో ఉన్న కొన్ని కోళ్లను, బిల్లు బుక్కులను కర్ణాటక పరిధిలోని ఉండ్రాలదొడ్డి శివారులో వదిలేశారు. కాగా, స్థానికులు వాటిని గమనించగా, అప్పటికే చాలా కోళ్లను కుక్కులు తినేశాయని, బిల్లు బుక్కులు ఇక్కడ వదిలేశారని ఆ గ్రామస్తులు మంజుల చికెన్ సెంటర్ యజమాని ధర్మకు ఫోన్ చేశారు. దీని ఆధారంగా కూడా వారు కర్ణాటక వైపు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయమై ఎస్పీ శ్రీనివాస్‌రావుతో సాక్షితో మాట్లాడగా.. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టామని, ఇలాంటి ఘటనలు గతంలో వనపర్తి జిల్లాలో జరిగాయని, జిల్లాలో చోటుచేసుకోలేదని, త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.


