జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ అధికారుల సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న అద్దెకార్ల యజమానుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. తొమ్మిదేళ్ల క్రితం నాటి ధరలనే ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుండటం, ఆ అరకొర బిల్లులు కూడా సకాలంలో విడుదల కాక పోవడంతో వాహన యజమానులు అప్పుల ఊబీలో కూరుకుపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవసరాల కోసం సుమారు 130కి పైగా అద్దె వాహనాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తహసీల్దార్లు, ఇతర కీలక శాఖల అధికారులు అద్దె వాహనాలనే వాడుతున్నారు. అయితే, అద్దె గిట్టుబాటు కాకపోవడం, నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో కొందరు యజమానులు తమ కార్లను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో చేసేదిలేక కొన్నిశాఖల అధికారులు సొంతంగా వాహనాలను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తొమ్మిదేళ్ల క్రితం నాటి ధరలే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అధికారుల కార్ల అద్దెకు సంబంధించిన ధరలను చివరిగా 2017 జులైలో నిర్ణయించారు. ఒక్కో వాహనం నెలకు 2500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం నెలకు కేవలం రూ.33 వేలు మాత్రమే చెల్లిస్తోంది. 2017లో లీటర్ డీజిల్ ధర కేవలం రూ.58, ప్రస్తుతం ధర రూ.104 ఉంది. కానీ ఆనాటి అద్దెనే ఇప్పటికీ చెల్లిస్తోంది. ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.33 వేలలోనే డీజిల్ ఖర్చు, డ్రైవర్ వేతనం, కారు మెయింటెనెన్స్ (రిపేర్లు, టైర్లు, సర్వీసింగ్) అన్నీ చూసుకోవాలి. డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో, ప్రభుత్వం ఇచ్చే అద్దెలో సగానికి పైగా ఇంధనానికే సరిపోతోంది. కారు కరెక్ట్‌గా తిరిగితే యజమానికి రూపాయి కూడా మిగలని పరిస్థితి ఉంది. సంబంధిత శాఖ అధికారుల దయాదాక్షిణ్యాలపైనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2017 నాటి అద్దెలే నేటికీ కొనసాగింపు
నాడు లీటర్ డీజిల్ రూ.58, ఇప్పుడు రూ.104
ధరల పెంపును పట్టించుకోని ప్రభుత్వం..
సంవత్సరాలుగా బిల్లులు కూడా పెండింగ్
వాహనాలనుఉపసంహరించుకుంటున్న యజమానులు
అప్పుల్లో యజమానులు..
పెరిగిన ధరలతో ఒకవైపు సతమతమవుతుంటే.. మరోవైపు ప్రభుత్వం గడిచిన 8 నెలలుగా.. ఎస్సీ అభివృద్ధి శాఖలో 32నెలల నుంచి, ఈజీఎస్‌లో 36నెలల నుంచి అద్దె బకాయిలను విడుదల చేయలేదు. దీంతో డీజిల్ పోయించడానికి, డ్రైవర్లకు జీతాలు ఇవ్వడానికి, చివరికి తమ కుటుంబాలను పోషించుకోవడానికి కూడా యజమానులు భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు ఇస్తే, అప్పుడు ఆ డబ్బును తెచ్చిన అప్పులకే కట్టేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా నిత్యావసరాలు, వాహన విడి భాగాలు, ఇంధన ధరలు భారీగా పెరిగినందున.. అందుకు అనుగుణంగా కార్ల అద్దెను పెంచాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


